Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల అదుపులో మావో అగ్రనేతలు ?

  • ఎన్ కౌంటర్ పై హక్కుల నేతల అనుమానాలు
  • పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలున్నారా?
  • అందరినీ న్యాయస్ధానంలో హాజరుపరచాలని వరవర రావు డిమాండ్
  • ఏఓబి ప్రాంతంలో కొనసాగుతున్న గ్రే హౌండ్స్ గాలింపు చర్యలు​
maoist leaders

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలున్నారా? ఉన్నారనే హక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేతలైన ఆర్ కె, గణేష్ తదితరులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న అగ్రనేతలందరినీ పోలీసులు హతమార్చేందుకు వ్యూహాలు రచిస్తున్న కారణంగా వారందరినీ వెంటనే న్యాయస్ధానంలో హాజరుపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో పోలీసులు చెబుతున్నట్లు జరిగిన ఎన్ కౌంటర్ పైనే కాకుండా, పోలీసులు ఇంకా జరుపుతున్న గాలింపు చర్యలపైన కూడా పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగువేల మంది పోలీసులు ఏఒబి ప్రాంతాన్ని నాలుగు రోజులుగా జల్లెడ పడుతున్నట్లు సమాచారం.

 సోమవారం ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత కూడా గడచిన మూడు రోజులుగా  ఏఓబి ప్రాంతంలో గ్రేహౌండ్స్, ఒడిస్సా పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే గడచిన మూడు రోజులుగా పోలీసులు  జరిపిన కాల్పుల్లో కనీసం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. దాంతో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 31కి పెరిగింది. అయినా పోలీసులు తమ గాలింపు చర్యలను ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో ఏఒబి ప్రాంతంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

  ఈ నేపధ్యంలోనే మంగళవారం నుండి హక్కుల నేతలు, ప్రజా సంఘాలు, వామపక్షాల నేతలు ఎన్ కౌంటర్ పై తమ అనుమానాలను వినిపించటం మొదలుపెట్టారు. సోమవారం జరిగినది ఎన్ కౌంటర్ కాదని, మత్తుమందు కలిపిన ఆహారాన్ని తినిపించటంతోనే పలువురు మావోయిస్టులు అపస్మారక స్ధితిలోకి వెళ్లిన్నట్లు హక్కుల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులను హతమార్చే ఉద్దేశ్యంతోనే పోలీసులు కొందరు మావోయిస్టులను తమకు అనుకూలంగా మార్చుకుని ప్లీనరీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 అందులో భాగంగానే తాము లొంగదీసుకున్న మావోయిస్టుల ద్వారా మిగిలిన వారికి విషం తినిపించి, ఆ తర్వాత పట్టుకుని కాల్చి చంపినట్లు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాతే పోలీసులు ఎన్ కౌంటర్ నాటకాలు మొదలుపెట్టినట్లు కూడా వరవరరావు తదితరులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని గురువారం మీడియాతో మాట్లాడుతూ, మావోయిస్టు అగ్రనేతలైన ఆర్కె, రవి, గణేష్  తదిరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

అపస్మారకంలోను, గాయాలతోను దొరికిన పలువురు అగ్రనేతలను పోలీసులు రహస్య స్ధావరాలకు తరలించుకుపోయారని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారందరినీ తక్షణమే న్యాయస్ధానంలో హాజరుపరచాలంటూ డిమాండ్లు మొదలుపెట్టారు. వీరి తాజా డిమాండ్ తో అసలు ఏమి జరుగుతోందో తెలీక సర్వత్రా అయోమయం నెలకొంది.

ఇదిలావుండగా, ఎన్ కౌంటర్ నేపధ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులకు పోలీసులు భారీ భద్రతను పెంచారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులెవరూ కొన్ని రోజుల పాటు మైదాన ప్రాంతాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios