కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన దళితుడు శీలం రంగయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రంగయ్య పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసు అధికారులు ప్రకటిస్తే... ప్రతిపక్షాలు మాత్రం దీన్ని నమ్మడంలేదు. పోలీసుల వల్లే ఈ లాకప్ డెత్ జరిగిందని వారు ఆందోళనకు దిగారు. 

ఇలా రంగయ్య లాకప్ డెత్ పై వివాదం కొనసాగుతున్న వేళ అతడి కుటుంబసభ్యులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. రంగయ్య కుమారుడు తన తండ్రి మృతిపై స్పందించారు. ''మా నాన్న మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు.శరీరం పై కూడా ఎలాంటి గాయాలు లేవు. పోలీసులు కొట్టలేదు. నేను మా బాబాయ్ కలిసి చూసాం'' అని రంగయ్య కుమారుడు అనిల్ వెల్లడించాడు. 

''మా నాన్న చావును రాజకీయం చేయవద్దు. మా అనుమతి లేకుండా బయటివారు వాళ్ళు తమ వ్యక్తిగత లబ్దికోసం కేసు వేసి మమ్మల్ని బయటకీడుస్తున్నారు. వీలయితే తమ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయండి కానీ వివాదంలోకి లాగకండి. ఇంటి పెద్దను  కోల్పోయిన తమ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయం ఆశిస్తున్నాము'' అని అన్నారు. 

read more  పోలీస్ స్టేషన్లోనే దళిత వేటగాడి మృతి... జ్యుడిషియల్ విచారణకు శ్రీధర్ బాబు డిమాండ్

మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూమ్ లో  మంగళవారం తెల్లవారుజామున వన్యప్రాణుల వేటగాడు శీలం రంగయ్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామ శివారులో రెండు రోజులక్రితం వన్యప్రాణుల వేట కోసం వెళ్లిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో శీలం రంగయ్య కూడా ఉన్నాడు.  అప్పటినుండి వీరు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. 

దీంతో మనస్తాపం చెందిన రంగయ్య బాత్రూమ్ కు వెలుతున్నానని చెప్పి వెళ్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు రంగయ్యను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని ధృవీకరించిన వైద్యులు.  

అయితే రంగయ్య మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపి భాద్యులపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలి మాజీ మంత్రి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అలాగే మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల  నష్టపరిహారం చెల్లించాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇలా అతడి మృతిపై వివాదం  చెలరేగుతుండటంతో అతడి కొడుకు తాజాగా స్పందించాడు.