పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన దళితుడు శీలం రంగయ్య మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపి భాద్యులపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలి మాజీ మంత్రి,మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అలాగే మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల  నష్టపరిహారం చెల్లించాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

''దళిత వ్యక్తి శీలం రంగయ్య మంథని  పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసు అధికారులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో కస్టోడియల్ డెత్ కావడం బాధాకరం. వన్యప్రాణుల కేసులో రంగయ్యను మూడు రోజులుగా పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. రంగయ్య పై వన్యప్రాణుల కేసులో పిడీ యాక్ట్ పెడతామని చెప్పడంతో చెయ్యని నేరానికి ఆత్మహత్య చేసుకున్నాడని భావించాల్సి వస్తుంది. జంతువు గురించి మనిషి బలి అయ్యాడు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''వన్యప్రాణులను కాపాడాలి-కానీ విచారణ సరైన పద్ధతిలో చేయాల్సి ఉండేది. రంగయ్యను  24వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే... పోలీస్ స్టేషన్లో 26వ తేదీన ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు?ఇలా రంగయ్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు ఉన్నాయి! అతడు తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్పులేదు...కానీ చట్టాన్ని చేతుల్లోకి  తీసుకొంటే ఎలా?''  అని నిలదీశారు. 

read more  పోలీస్ స్టేషన్ బాత్రూంలో ఉరేసుకున్న వేటగాడు.. ఏం జరిగిందంటే..

''రంగయ్య మృతదేహాన్నీ ఉదయాన్నే పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రికి, అక్కడి నుండి పోస్ట్ మార్టం గదికి అదర భాదరగా ఎందుకు  తరలించి పోస్ట్ మార్టం చేయించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 10 నుంచి 15 కస్టోడియల్ డెత్స్ నమోదు అయ్యాయి. వీడియో రికార్డింగ్  చిత్రీకరణ ద్వారా రీపోస్ట్ మార్టం చేయాలి. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ వైద్యుల చేత మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయించాలి'' అని అన్నారు. 

''రీపోస్ట్ మార్టం జరిగేవరకు మృత దేహాన్ని జిల్లా ఆసుపత్రిలో ఫ్రీజర్ లో భద్రపరచాలి. దళితుల పై పోలీసుల జులుం కరెక్ట్ కాదు. రంగయ్య కేసును ఎస్సి- ఎస్టీ  కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి పిర్యాదు చేస్తాం.కేసు పై అనుమానాలు ఉన్నందున నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ,డీజీపీపై ఉంది'' అన్నారు. 

''ఫ్రెండ్లి పోలీసింగ్ అంటే కస్టోడియల్ డెత్ చేయడమా? రంగయ్య కుటుంబ సభ్యులను కాంప్రమైజ్ కావాలని ఇద్దరు ప్రత్యేక అధికారులను డీజీపీ నియమించడం దారుణం. మంథని డివిజన్ పరిధిలో లేని అధికారులు రంగయ్య కుటుంబాన్ని బెదిరించడం...కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేయడం ఏంటి?  మంథని ఘటన పై  రాష్ట్ర డీజీపీ, హోమ్ మంత్రి స్పందించాలి. రంగయ్య ఘటన పై ఫోరెన్సిక్  నిపుణుల ద్వారా నిజ నిర్దారణ కమిటీ వేసి ఈ విషాద సంఘటన వెనుక ఎంతటి వారున్న శిక్షించాలి'' అని డిమాండ్ చేశారు.