ఈ తల్లి బాధ మాటలకందనిది... కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే కన్నుమూసిన భర్త (వీడియో)
కన్నబిడ్డను చూసేందుకు హాస్పిటల్ కు వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయి ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.

పల్నాడు : అతడు బిడ్డపుట్టిన సంతోషంలో వున్నాడు. కుటుంబసభ్యులు, స్నేహితులతో ఈ ఆనందాన్ని పంచుకుని బిడ్డను చూసుకునేందుకు హాస్పిటల్ కు బయలుదేరారు. అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. హాస్పిటల్ కు వెళుతున్న అతడు మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా అతడు భార్యాబిడ్డలు వున్న హాస్పిటల్ కే విగతజీవిగా వెళ్లాడు. బిడ్డను చూసేందుకు భర్త వస్తాడని ఎదురుచూస్తున్న ఆమె భర్త మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతం అయ్యింది. బిడ్డ పుట్టిన గంటల వ్యవధిలోనే భర్త చనిపోవడంతో ఆ బాలింత బాధ వర్ణనాతీతం. ఈ హృదయవిదారక ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... పల్నాడు జిల్లా కారంపూడి చెందిన బత్తిన ఆనంద్(30), రామాంజలి(27) భార్యాభర్తలు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు సంతానం వుండగా తాజాగా మరో మగబిడ్డకు జన్మనిచ్చింది రామాంజలి. నిండు గర్భంతో వున్న ఆమె శుక్రవారం పురిటినొప్పులతో బాధపడగా భర్త ఆనంద్ హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ప్రసవం జరిగే పరిస్థితి లేకపోవడంతో గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారడంతో నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు.
వీడియో
కుటుంబసభ్యులను తోడుగా భార్యను నరసరావుపేట హాస్పిటల్ కు తరలించి డబ్బులు సమకూర్చుకునేందుకు ఆనంద్ ఇంటికి వెళ్లాడు. అతడు ఇంటివద్ద వుండగానే భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని శనివారం తెల్లవారుజామున హుటాహుటిన నరసరావుపేటకు బయలుదేరాడు ఆనంద్. ఇలా బైక్ పై వేగంగా వెళుతుండగా మార్గమధ్యలో పెద్ద గుంత వుండటం ఆనంద్ చూసుకోలేదు. దీంతో అదే వేగంతో బైక్ ను పోనివ్వడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు భార్యాబిడ్డలు వున్న నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే సరికే పరిస్థితి విషమించడంతో ఆనంద్ ప్రాణాలు కోల్పోయాడు.
Read More 13 ఏళ్ల దత్తపుత్రిక దాష్టీకం.. ప్రియుడితో తల్లిని కడతేర్చిన వైనం..
అయితే బిడ్డను చూసేందుకు వస్తాడని ఎదురుచూస్తున్న భర్త ఇలా మృతదేహంగా రావడం చూసి రామాంజలి గుండెపగిలేలా రోదిస్తోంది. ఈ మరణవార్త బిడ్డపుట్టిన ఆనందంలో వున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. కంటికిరెప్పలా చూసుకోవాల్సిన వాడే కన్నుమూయడంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది.