బాబాయ్ అంటూ బంధుత్వం కలిపి చీటింగ్... పెనమలూరులో కొత్తరకం మోసం
ఇంతకాలం టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడిన చీటర్స్ ఇప్పుడు బంధుత్వాల పేరిట సెంటిమెంటల్ మోసాలకు పాల్పడుతున్నాారు. ఇలా వృద్దుడిని బాబాయ్ అంటూ నమ్మించి నయవంచన చేసాడు ఓ మోసగాడు.
పెనమలూరు : ముక్కూ మొఖం తెలియనివాడిని బంధువని నమ్మి వృద్ద దంపతులు మోసపోయారు. బాబాయ్ అంటూ ఆప్యాయంగా మాట్లాడిన మోసగాడు రూ.80 వేలు తీసుకుని ఉడాయించాడు. కృష్ణా జిల్లాలో ఈ కొత్త తరహా మోసం బయటపడింది.
బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనమలూరులోని డీఎన్ఆర్ కాలనీలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి గంటా రాజేశ్వరరావు భార్యతో కలిసి నివాసముండేవాడు. వీరి వద్ద డబ్బులు వున్నాయని గుర్తించిన ఓ మోసగాడు సెంటిమెంట్ నాటకమాడి వారిని మోసం చేయడానికి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగాడు.
రాజేశ్వరరావు ఒంటరిగా వున్న సమయంలో అతడితో మాటలుకలిపి పరిచయం పెంచుకున్నాడు మోసగాడు. తాను మీకు దూరం చుట్టాన్ని అని... కొడుకు వరస అవుతానని చెప్పాడు. వృద్దాప్యం కారణంగా మీరు గుర్తుపట్టలేకపోతున్నారని చెప్పాడు. అతడి మాయమాటలు విన్న రాజేశ్వరరావు నిజమేనని నమ్మాడు. తన ఇంటికి తీసుకెళ్ళి భార్యన కూడా పరిచయం చేసాడు రాజేశ్వరరావు. దీంతో వృద్దదంపతులు తన మాయలో పడిపోయాడని భావించిన దుండగుడు సెంటిమెంట్ డ్రామాకు తెరతీసాడు.
Read More తల్లితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. ఆమె కూతురిపై రాడ్డుతో దాడి...
తన కూతురు ఓణీ పంక్షన్ వుందని... తప్పకుండా మీరు రావాలని దంపతులను సదరు మోసగాడు ఆహ్వానించాడు. అయితే ఈ ఫంక్షన్ కోసం తాను కొంత డబ్బు దాచానని... ఇవన్నీ రెండువేల నోట్లేనని తెలిపాడు. కానీ రెండువేల నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తాను ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. పంక్షన్ ఎక్కడ ఆగిపోతుందోనని భయమేస్తోందని సెంటిమెంట్ తో వృద్దదంపతులను పడేసాడు. అతడి నిజంగానే బాధలో వున్నాడని నమ్మి తమ వద్దగల రూ.80వేలు అతడికి ఇచ్చారు. అంత మొత్తం 2000 నోట్లు తమకు ఇవ్వాలని సూచించారు.
రాజేశ్వరరావు వద్ద రూ.80వేలు తీసుకున్న మోసగాడు అంతమొత్తం 2వేల నోట్లు ఇస్తానని బండిపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఓ బ్యాంక్ ఏటిఎం వద్దకు తీసుకెళ్లి డబ్బులు తీసుకువస్తానని వృద్దుడిని నిలబెట్టాడు. డబ్బులు తెస్తానని చెప్పినవాడు ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన వృద్దుడు చుట్టుపక్కలంతా వెతికినా దొరకలేడు. దీంతో మోసపోయానని గుర్తించిన రాజేశ్వరరావు పెనమలూరు పోలీసులను ఆశ్రయించాడు.
వృద్ద దంపతులను బంధుత్వం పేరిట మోసంచేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలియని వారి మాటలు నమ్మి ఇలా మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.