తల్లితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. ఆమె కూతురిపై రాడ్డుతో దాడి...
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కూతురిమీద దాడికి పాల్పడ్డాడు. రాడ్డుతో 8సార్లు బాది హత్యాయత్నం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రకాశం : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో.. శుక్రవారం ఉదయం తల్లి కూతుర్ల మీద హత్యాయత్నం జరిగింది. మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు శనివారంనాడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రామకృష్ణ నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
కేసు వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ఈ హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని తెలిపారు. దర్శికి చెందిన వెంకట ప్రభు శేషసాయి అలియాస్ పెద్ది శెట్టి సాయిరాంకు స్థానికంగా నివాసం ఉంటున్న గోవిందమ్మ అనే మహిళతో కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది.
ఈ నేపథ్యంలోనే గోవిందమ్మ కుమార్తె అయిన ప్రసన్నను కూడా కొద్ది కాలంగా సాయిరాం తిట్టడం, కొట్టడం చేస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన గోవిందమ్మ అతడిని ఇంటికి రావద్దని చెప్పింది. అయినా వినకుండా రావడమే కాకుండా తీవ్రంగా వేధింపులకు పాల్పడుతుండేవాడు.
ఈ విషయాన్ని చూసిన ప్రసన్న భరించలేకపోయింది. ఇంకోసారి తమ ఇంటికి వస్తే,, ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని గట్టిగా హెచ్చరించింది.
ఆ మాటలు విన్న తర్వాత సాయిరాం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు గోవిందమ్మతో తన వివాహేతర సంబంధానికి ప్రసన్న అడ్డుగా ఉందని.. ఆమెను తొలగించుకోవాలని కుట్రపడ్డాడు. దీంట్లో భాగంగానే శుక్రవారం ఉదయం ప్రసన్న మీద దాడి చేశాడు. ఇంటి బయట మంచంపై పడుకుని ఉన్న ప్రసన్న తల మీద 8సార్లు రాడ్డుతో విచక్షణ రహితంగా బాదాడు.
ఆ తర్వాత ఆమె చనిపోయి ఉంటుందనుకొని అక్కడి నుంచి పారిపోయాడు. విషయం చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
నిందితుడు సాయిరాం కోసం గాలింపు చేపట్టారు. అలా శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిందితుడిని కనిపెట్టి అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచారు.