హైదరాబాద్: కర్ణాటకలో బిజెపి వెంటనే అధికారాన్ని చేపట్టకుండా అడ్డేసినవారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు తెలుస్తోంది. గోవా ఫార్ములాను సోనియా చెవిన ఉదింది వారేనని చెబుతున్నారు.

జెడిఎస్ కు మద్దతు ఇస్తూ పొత్తు ఫార్ములాను రూపొందించడంలో కాంగ్రెసు చాలా వేగంగా కదలడానికి సోనియా గాంధీకి సలహా ఇచ్చినవారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు చెబుతున్నారు.

గోవాలో బిజెపి చాలా వేగంగా కదిలి కూటమి కట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నట్లుగానే కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ కలిస్తే అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయని, బిజెపిని అడ్డుకోవడానికి అదే మార్గమని ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది.

సోనియా గాంధీ కుమారస్వామికి ఫోన్ చేసి, పొత్తు విషయంలో అత్యంత వేగంగా పావులు కదపడం వల్లనే బిజెపి ప్రభుత్వం వెంటనే ఏర్పడకుండా అడ్డుకోగలిగారనే అభిప్రాయం ఉంది. లేదంటే, అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే గవర్నర్ ఆహ్వానించి ఉండేవారని అంటున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీ సాధించడం అంత కష్టసాధ్యమయ్యేది కాదని అంటున్నారు.