వారసత్వ హోదాలో కనీసం 20 మంది బరిలో దిగే అవకాశాలున్నాయి. చంద్రబాబు కూడా వారసత్వానికి సానుకూలంగా ఉండటంతో ఆయా కుటుంబాలు రెచ్చిపోతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టిడిపి తరతపున పోటీ చేసేందుకు పలువురు వారసులు రెడీ అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వారసులు రెడీ అవుతుండటం గమనార్హం. వారసత్వ హోదాలో పలువురు ఇప్పటి నుండే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే, ఒక్కోసారి శిక్షణ ఎక్కువైపోయిన చోట్ల రచ్చలు జరుగుతున్నాయి. అధినేతకు తలనొప్పులూ వస్తున్నాయనుకోండి అది వేరే సంగతి.
వారసత్వ హోదాలో కనీసం 20 మంది బరిలో దిగే అవకాశాలున్నాయి. చంద్రబాబు కూడా వారసత్వానికి సానుకూలంగా ఉండటంతో ఆయా కుటుంబాలు రెచ్చిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన లాగే టిడిపి కూడా యువతరంపైనే ప్రధాన దృష్టి పెట్టింది. కాబట్టి యువతను ఎన్నికల రంగంలోకి దింపటం ద్వారా మిగిలిన యువతను ఆకట్టుకోవచ్చన్నది చంద్రబాబు, లోకేష్ వ్యూహంగా కనబడుతోంది. వారసుల ఎంపిక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతోందట. ప్రతీ జిల్లాలోనూ ఒక స్ధానానికి తక్కువ కాకుండా యువతను పోటీ చేయించే ఉద్దేశ్యంతో అధినేత ఉన్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో ఎక్కువమంది వారసులు పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురం జిల్లాలోని అనంతపురం పార్లమెంట్ తో పాటు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జెసి సోదరుల వారసులు పోటీకి సిద్ధపడుతున్నారు. అలాగే, కల్యాణదుర్గం అసెంబ్లీ సీటు నుండి హనుమంత చౌదరి స్ధానంలో కుమారుడు మారుతి పోటీ చేయనున్నారు. ఇక, రాప్తాడు లేదా పెనుగొండ లేదా ధర్మవరం నుండి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాళహస్తి నుండి మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి బదులు కొడుకు సుధీర్ పోటీ చేస్తారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ నుండి కెఇ కృష్ణమూర్తి స్ధానంలో కొడుకు కెఇ శ్యాంబాబు పోటీ చేస్తారు.
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటు కొడుకు విజయ్ కూడా ఏదో ఓ నియోజకవర్గంలో పోటీ చేయవచ్చని సమాచారం. అదేవిధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుడిని పోటీలోకి దింపే యోచనలో ఉన్నారు. అదేవిధంగా, పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణ స్ధానంలో కొడుకు సిద్ధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు నియోజకవర్గంలో కళా వెంకటరావు కుమారుడు పోటీకి సై అంటున్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లోనే ఓడిపోయిన కరణం వెంకటేష్ మళ్ళీ పోటీకి రెడీ అంటున్నారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో మంత్రి శిద్ధా రాఘవరావు స్ధానంలో కొడుకు సుధీర్ కుమార్ రెడీ అంటున్నారు. తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి కూతురు పోటీకి రెడీ అవుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకెంతమంది రెడీ అంటారో చూడాలి.
