కోడెల ప్రభుత్వ ఆస్తి

కోడెల ప్రభుత్వ ఆస్తి

శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఇక నుండి ప్రభుత్వ ఆస్తి. అదేంటి ఓ వ్యక్తి ప్రభుత్వానికి ఆస్తి ఎలా అవుతారని అనుమానం వస్తోందా? మీ అనుమానం తీరాలంటే ఈ వార్తను చదవాల్సిందే. ఇంతకీ విషయం ఏంటంటే, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కోడెలకు పోయిన నెలలో ఓ లేఖ రాసారట. ఆ లేఖను ఆదివారం విడుదల చేసారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే ‘ అంకిత భావంతో పనిచేసే మీలాంటి శాసనసభ్యుడు, శాసనసభాపతిగా ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నందుకు మన ప్రభుత్వానికి మిమ్మలను ఆస్తిగా భావిస్తున్నాను’ అని ఉంది.

ఓ వ్యక్తిని ప్రభుత్వ ఆస్తిగా భావించటమేంటో లోకేష్ కే తెలియాలి. ‘నూతనంగా ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-17 సంవత్సరాల మధ్యకాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో పంచాయితీజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మీరు చేపట్టిన పనులను చూసి నేనెంతగానో గర్విస్తున్నాను’ అని కూడా లోకేష్ పేర్కొన్నారు. ‘మీరు సూచించిన అమూల్యమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి నూతన ఆవిష్కరణలకు అవసరమైన మార్పులు, చేర్పులకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో తగు చర్యలు తసుకుంటాం’ అని లేఖలో లోకేష్ పేర్కొనటం విశేషం.

నిజమే, కోడెల నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని పక్కకు పెడితే పార్టీకి మాత్రం అంకితభావంతో పని చేస్తున్న విషయం స్పష్టంగా కనబడుతోంది. అసెంబ్లీ వ్యవహారాల నిర్వహణను చూస్తేనే కోడెల అంకితభావం తెలిసిపోతుంది.     విలువలు, నిజాయితీ, పారదర్శకత గురించి  లెక్షర్లు దంచే కోడెల ఫిరాయింపుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నదో అందరూ చూస్తున్నదే. ప్రతిపక్ష వైసిపి ఈ విషయంలో ఎంత మొత్తుకున్నా, చివరకు అసెంబ్లీని బహిష్కరించినా తనకేమాత్రం పట్టనట్లు ఉన్నారంటే కోడెలకు  టిడిపి పట్ల ఎంతటి అతకితభావం ఉండాలి.

నిబంధనలకు విరుద్ధంగ గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి ఎంఎల్ఏని ఏకంగా ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేయటమంటే మాటలా ? పైగా రోజాను సభలోకి అనుమతించాలని సాక్ష్యాత్తు  హైకోర్టు తీర్పు చెప్పినా ససేమిరా అన్నారంటే ఎవరికోసం?  నిజానికి స్పీకర్ గా ఎంపికైన వ్యక్తి సభలో అందరు ఎంఎల్ఏలను ఒకే విధంగా చూడాలి. కానీ సభలో జరుగుతున్నదేంటో అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నదే. గతంలో ఏ స్పీకర్ ఎదుర్కోరంతటి  విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటున్నా నిబ్బరంగా వ్యవహరిస్తున్న కోడెల లాంటి నేతను ప్రభుత్వ ఆస్తిగా  పరిగణించటంలో లోకేష్ తప్పేమీ లేదు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos