మొత్తానికి నారాలోకేష్ సెల్ఫ్ మార్కెటింగ్ లో చంద్రబాబానాయుడునే మించిపోతున్నారు. ఒకవైపు ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే ఇంకోవైపు తనను తాను పొగిడేసుకోవటం లోకేష్ కే చెల్లింది. మహానాడు సాక్షిగా జరుగుతున్నది కూడా అదే మూడు రోజులుగా. ఈరోజు మాట్లాడుతూ అవినీతిపై జగన్ తో చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ విసిరారు.

జగన్ అవినీతిపైన, తనపై వైసీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలపైన ఎటువంటి చర్చకైనా తాను సిద్ధమంటూ లోకేష్ సవాలు విసిరారు. విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడు వేదికగా లోకేష్ ఈరోజు మాట్లాడుతూ, తన చిన్నపుడే తన తాత(ఎన్టీఆర్) ముఖ్యమంత్రి. తన కొడుకు దేవాన్ష్ కూడా చిన్నోడే. దేవాన్ష్ తాత(చంద్రబాబునాయుడు) ముఖ్యమంత్రి అని లోకేష్ అన్నారు. అంటే, రెండు పోలికల ద్వారా లోకేష్ ఏం చెప్పదలచుకున్నారో అర్ధం కాలేదు.

ప్రజలకు సేవ చేయటం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనపైన ఏనాడైనా ఒక్క అవినీతి ఆరోపణ అయినా వచ్చిందా అంటూ లోకేష్ కార్యకర్తలను ప్రశ్నించారు. తన తాత, తండ్రి అంతటి గొప్ప పేరు తెచ్చుకుంటానో లేదో తెలీదు కానీ వారికి చెడ్డపేరు మాత్రం తేనని చెప్పారు.

లోకేష్ చెప్పింది బాగానే ఉందికానీ పట్టిసీమలో రూ. 450 కోట్ల అవినీతి జరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చెప్పిన విషయాన్ని మరచిపోయినట్లున్నారు.  ప్రభుత్వంలో అవినీతి జరిగిందని కాగ్ తేల్చిందంటే అందుకు బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడా లేక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డా?

ప్రతీ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయాలను పెంచేసింది ఎవరు? ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా లోకేష్ చెపితే బాగుంటుంది. అగ్రిగోల్డ్ భూములు, రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ నేతలు వేలఎకరాల కొనుగోళ్ళ ఆరోపణలపై  లోకేష్ వివరణ ఇస్తే బాగుంటుంది కదా?

రాజధాని నిర్మాణానికి చంద్రబాబు మక్కువ చూపుతున్న స్విస్ ఛాలెంజ్ పద్దతిని కోర్టు ఎందుకు వ్యతిరేకించిందో లోకేష్ చెప్పగలరా? గడచిన మూడేళ్ళుగా లోకేష్ పై ఎన్నో అవినీతి ఆరోపణలు, విశాఖపట్నంలోనే వేల కోట్ల రూపాయలు విలువైన భూములను సొంతం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో  చిన్ననిప్పు నారా లోకేష్ చెబితే బాగుంటుంది.