త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 195 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో పొత్తు అంశం ప్రస్తుతం చర్చల దశలో వుంది.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 195 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 9 మందికి తొలి జాబితాలో స్థానం కల్పించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. దీనికి కారణం లేకపోలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో పొత్తు అంశం ప్రస్తుతం చర్చల దశలో వుంది.
బీజేపీని కూటమిలోకి తెచ్చేందుకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. కానీ అటు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పొత్తు అంశంపై క్లారిటీ రాలేదు. అయితే టీడీపీ , జనసేనల తొలి జాబితాలో కొన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది. బీజేపీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత వాటికి కూడా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాతే బీజేపీ కూడా ఏపీలో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం వుంది.
మరోవైపు.. అభ్యర్ధుల ఎంపిక, పొత్తులపై బీజేపీ నేతలు వేగంగానే పావులు కదుపుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేత శివప్రకాష్ అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు తమ సలహాలు, సూచనలు తెలిపారు. పార్టీకి బలమున్న స్థానాలను ప్రత్యేకంగా రాసుకున్నారు. పొత్తులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ముందుకు సాగగలమా , లేదా అన్న దానిపై ఇలా పలువురు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పొత్తుల విషయంలో జాప్యం చేయకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెజార్టీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చే వారం పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది.
ఇకపోతే.. శివప్రకాష్‌తో భేటీ తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేనతతో బీజేపీ పొత్తు వుంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తుకు వెళ్లడం వల్లే తాను విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అయితే పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని.. వారి మాటను శిరసా వహిస్తామని ఆయన తేల్చిచెప్పారు.
