లాక్‌డౌన్ సడలింపులు తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌లు మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి.

తాజాగా విజయవాడ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నెల 26 నుంచి విజయవాడ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

మెడికల్ షాపులు, అత్యవసర దుకాణాలు మినహా అన్నీ మూసివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యవసరం కానీ ప్రైవేట్, పబ్లిక్ కార్యాలయాలు కూడా మూసివేస్తామని మేజిస్ట్రేట్ తెలిపారు.

Also Read:ఒక్క రోజులోనే ఎనిమిది మంది మృతి: ఏపీలో 9,834కి చేరిన కరోనా కేసులు

కోవిడ్ 19 గొలుసును కట్ చేసేందుకు ప్రస్తుత పరిస్ధితుల్లో లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఇంతియాజ్ వెల్లడించారు. రేపు, ఎల్లుండి నగర వాసులు తమకు కావాల్సిన నిత్యావసరాలు తెచ్చుకోవాలని కలెక్టర్ విజ్ఙప్తి చేశారు.

లాక్‌డౌన్ సమయంలో ప్రజలెవ్వరూ బయట తిరగొద్దని, ప్రజా రవాణాను కూడా నిలిపివేస్తున్నట్లు ఇంతియాజ్ వెల్లడించారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తి జరుగుతోందని.. అలాంటి చోట్ల కఠిన నియమాలు అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

బెజవాడలో వచ్చే వారంపాటు ఎలాంటి లాక్‌డౌన్ సడలింపులు వుండబోవని జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. వారం తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఇంతియాజ్ వెల్లడించారు.