మంత్రి దాడిశెట్టి రాజా మామ సూర్యచక్రం తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడని ఓ మహిళ ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది.

అనకాపల్లి : ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా మామ అధికార అండతో తన భూమిని కబ్జా చేసాడని ఓ మహిళ ఆందోళనకు దిగింది. రెండేళ్ల క్రితమే తనను బెదిరించి అగ్రిమెంట్ చేయించుకున్న మంత్రి మామ ఇప్పుడు భూమిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడని మహిళ తెలిపింది. తమ కుటుంబం మొత్తానికి ఆదారమైన భూమిని కబ్జాదారుల నుండి కాపాడి న్యాయం చేయాలని మహిళ ప్రభుత్వాన్ని కోరుతోంది. 

వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సమీపంలో పాల్తేరుకు చెందిన బాలకామేశ్వరి కుటుంబానికి రెండెకరాలకు పైగా భూమి వుంది. ఈ భూమిపై మంత్రి దాడిశెట్టి రాజా మామ సూర్యచక్రం కన్ను పడిందని... దీంతో తమను భూమిని అమ్మాలని బెదిరించాడని బాలకామేశ్వరి తెలిపింది. తమను భయపెట్టి భూమికి సంబంధించిన అగ్రిమెంట్ చేయించుకున్నాడని... ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మంత్రి మామపై మహిళ ఆరోపణలు చేసారు. 

 మార్కెట్ ధర చెల్లించి భూమిని కొనుగోలు చేయాలని కోరినా సూర్యచక్రం వినిపించుకోవడం లేదని బాలకామేశ్వరి ఆందోళన వ్యక్తం చేసారు. రెండేళ్ళుగా తమ భూమిని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమను బెదిరించి భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్న సూర్యచక్రంను అరెస్ట్ చేయాలని మహిళ కోరింది. ప్రభుత్వమే తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత మహిళ కోరింది.

Read More నా మీద పోటీ చేస్తావా లేదా .. పవన్‌కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్, గంట డెడ్‌లైన్

ఇక తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై మంత్రి దాడిశెట్టి మామ సూర్యచక్రం స్పందించారు. భూమిని అమ్ముతానని బాలకామేశ్వరి ముందుకు రావడంతో రూ.90 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అప్పుడు ప్రయత్నించినా అనుమతులు రాకపోవడంతో కుదరలేదని అన్నారు. ఇంతలో అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న బాలకామేశ్వరి తననే బ్లాక్ మెయిల్ చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేయడం ప్రారంభించిందని మంత్రి దాడిశెట్టి రాజా మామ సూర్యచక్రం పేర్కోన్నారు.