‘హరికృష్ణ సీఎంగా ఉండాలి’

lakshmiparvathi sensational comments on chandrababu
Highlights

‘చంద్రబాబు వద్దు.. ఆ బాధ్యతలు వారు చేపట్టాలి’

టీడీపీ నుంచి నారా కుటుంబాన్ని బహిష్కరించాలని ఎన్టీఆర్ భార్య, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడి ఆయన వారసుల్లో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలన్నారు. 

చంద్రబాబు ఎన్టీఆర్‌ వారసుల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే ఎమ్మెల్యే సీటు ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెట్టడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు.  జయంతికి, వర్ధంతికి తేడా తెలియని తన కొడుకు లోకేష్ ని మంత్రిని చేసి కాబోయే సీఎం అనడం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలని హరికృష్ణ ప్రత్యేకంగా అడగాలా.. ఆయన వారసునిగా సీఎంగానో, ఇతర ముఖ్యస్థానంలో ఉండాల్సిన హరికృష్ణను ఇలాంటి స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. 

బాబు తెలుగుదేశం పార్టీని మళ్లీ కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనిని ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకోవాలని లక్ష్మీ పార్వతి కోరారు. ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఆత్మగౌరవంతో  వచ్చిన పార్టీని ఆత్మ వంచన పార్టీగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. 

 గత జయంతి వేడుకలకి ఈ జయంతికి ఘాట్ వద్ద ఏర్పాట్లలో చాలా తేడా ఉందని లక్ష్మీ పార్వతి అన్నారు. ఘాట్ పరిసరాలు, రోడ్డు ఎలాంటి అలంకరణ లేకుండా బోసిపోవటం చూస్తే ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేయటంలో భాగమనిపిస్తోందని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన అభిమానులు అర్థం చేసుకోవాలన్నారు. 

loader