న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాశారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఆయన ఈ లేఖ రాశారు.

"గత నాలుగు సంవత్సరాలుగా అధికార మత్తులో, మోడీ మాయలో ఉన్న మీరు, ఎన్నికలు ముంగిట్లో కొచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకొచ్చి హోదా ఉద్యమంలోకి హఠాత్తుగా ఊడిపడి పొద్దెరుగకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. గతిలేకనే బీజేపీతో తెగతెంపులు చేసుకొన్న మీరు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని గురించి కేంద్రతో పోరాటం చేస్తున్న పోరాటయోధుడిగా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ పాత్రను తక్కువ చేసి చూపడానికి నానా తంటాలు పడుతున్నారు" ఆయన చంద్రబాబు తీరుపై దుమ్మెత్తి పోశారు. 

"అయితే మీరు, మీ పార్టీ గత నాలుగు నెలలుగా చేస్తున్న పోరాటాన్ని స్వతంత్ర ఉద్యమ పోరాటం స్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో మీ స్వోత్కర్ష, సెల్ఫ్ డబ్బా శృతిమించి అసహజంగా కనిపించి జనానికి రోత పుట్టిస్తున్నాయి" అని అన్నారు.

"మీ పార్టీ వారు చేస్తున్న దీక్షలు, ధర్నాలు బరువు తగ్గడానికి చేస్తున్న ప్రయోగాలేనని, ఇక మీ నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాటా దీక్షలు.. ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మాయ చేయడానికి చేస్తున్న మీ ప్రచార ఆర్భాటాలేనని సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం మీకు తెలియనిది కాదు" అని కేవీపి అన్నారు. 

"అసత్య ప్రచారాలు చేస్తూ, చివరకు ఆ అసత్యాలని నిజాలుగా జనాన్ని నమ్మించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు జనం విషయంలో ఎలా పనిచేస్తున్నాయో తెలియదు గాని.. మీ విషయంలో,మీ భజనబృందాల విషయంలో చక్కగా పనిచేస్తున్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.