చంద్రబాబుకు అల్జీమర్స్ (మతిమరుపువ్యాధి)ముదిరిపోయి ‘మెగలోమేనియా’ పట్టుకుందన్నారు. మెగలోమేనియా రోగితో రాష్ట్రం మొత్తానికి ముప్పన్నారు

పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ను చంద్రబాబు తనదిగా ఆపాదించుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. అబద్దాలు చెబుతూ, నిజాలను తారుమారు చేస్తున్నారంటూ సిఎంపై మండిపడ్డారు.

ప్రాజెక్టు చరిత్రను వినిపించి సిఎంను మీడియా సమావేశంలో గంటకుపైగా కడిగిపారేసారు. అలాగే, ప్రాజెక్టుపై సిఎంకు నేరుగా కెవిపి కొన్ని ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు మానసిక పరిస్ధితిపైన, ఆరోగ్య స్ధితిపైన అనుమానాలు వ్యక్తం చేశారు. 2018కి ప్రాజెక్టు పూర్తికాదని సవాలు విసిరారు.

చంద్రబాబుకు అల్జీమర్స్ (మతిమరుపువ్యాధి)ముదిరిపోయి ‘మెగలోమేనియా’ పట్టుకుందన్నారు. అల్జీమర్స్ వచ్చిన వ్యక్తితో ఎవరికీ సమస్య ఉండదన్నారు. కానీ మెగలోమేనియా రోగితో రాష్ట్రం మొత్తానికి ముప్పున్నారు. అందుకు పోలవరం ప్రాజెక్టునే కెవిపి ఉదాహరణగా చెప్పారు.

ప్రాజెక్టు పూర్తికావటంలో క్రెడిట్ కాంగ్రెస్ పార్టీది అయితే చంద్రబాబు తన కలగా చెప్పుకుంటున్నారన్నారు. ప్రాజెక్టు మొత్తం మీద చంద్రబాబు పాత్ర ఏమిటో రుజువు చేయాలని సవాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టు మంజూరులో కానీ, పనులు మొదలవట్టంలో గానీ చంద్రబాబు, టిడిపి పాత్ర ఒక్క శాతం కూడా లేదన్నారు.

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధి ప్రాజెక్టును మంజూరు చేయగా మాజీ ముఖ్యమంత్రి అంజయ్య 1980ల్లో శంకుస్ధాపన చేసినట్లు తెలిపారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం అయిన తర్వాతే ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులన్నీ తెచ్చినట్లు చెప్పారు. 175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 145 కిలోమీటర్లు వైఎస్ హయాంలోనే పూర్తయిందన్నారు.

ప్రాజెక్టు సాకారమవ్వటంలో క్రెడిట్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీదేనన్నారు. అందుకే ప్రాజెక్టు పనులు మొదలయ్యేప్పుడు ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టుగా పేరు కూడా మార్చినట్లు తెలిపారు. అటువంటిది 2014లో సిఎం అయిన తర్వాత ఒక్క జివోతో ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు పేరులో నుండి ఇందిరాసాగర్ పేరును ఎలా తొలగిస్తాంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

మొదటిసారి మంత్రిని చేసిన మహాతల్లి ఇందిరాగాంధిని, పిల్లనిచ్చిన మామగారు ఎన్టిఆర్ ను మానవత్వం లేకుండా ఔరంగాజేబులాగ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేసారు. గతంలో ఎన్నడూ పోలవరం ప్రాజెక్టు పేరైనా తలవని చంద్రాబు ఇపుడు తన కాల సాకారమవుతోందని చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు.

తెలంగాణాలోని ముంపు మండలాలను ఏపిలో కలిపితే తప్ప సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేదిలేదని మోడితో చెప్పానని చంద్రబాబు అబద్దాలాడుతున్నట్లు కెవిపి ఎద్దేవా చేసారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాను కూడా తాకట్టుపెట్టిన ఘనుడని చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసారు.

ప్రాజెక్టు అమలులో లొసుగులను ప్రశ్నిస్తే రాక్షసులని, ఉన్మాదులని ముద్రవేయటం పట్ల కెవిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.

వైఎస్ హయాంలో కుడికాల్వ పనులు పూర్తికాకుండా ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబే కేసులు వేయించినట్లు కెవిపి ఆరోపించారు. మొత్తం మీద చంద్రబాబు కల సాకారంపై కాంగ్రెస్ గట్టి కౌంటరే మొదలుపెట్టంది.