కర్నూల్:కరోనాను అరికట్టే విషయంలో కర్నూల్ అధికారుల నిర్లక్ష్యంపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. కర్నూల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో మృతదేహాలు తారుమారయ్యాయి. దీంతో ఓ మృతదేహానికి సంబంధించిన బంధువులు ఆందోళనకు దిగారు.

కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 6వ తేదీన రాంబాబు అనే  వ్యక్తి ఆయాసంతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దీంతో డెడ్ బాడీకి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన ఈ మృతదేహానికి సంబంధించిన కరోనా రిపోర్టులు వచ్చాయి.రాంబాబుకు కరోనా  సోకలేదని ఈ రిపోర్టులు తేల్చాయి.

also read:వాట్సాప్‌లో టెన్త్ విద్యార్థులకు పాఠాలు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

అయితే ఇదే ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు కరోనా ఉన్నట్టుగా రిపోర్టులో తేలింది. ఈ వ్యక్తి పేరు కూడ రాంబాబు పేరుకు సామీప్యత ఉంటుంది.  రాంబాబు మృతదేహన్ని తీసుకొనేందుకు ఇవాళ బంధువులు కర్నూల్ ఆసుపత్రికి వచ్చారు. కర్నూల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో రాంబాబు మృతదేహం లేదు.

కరోనా సోకిన వ్యక్తి కుటుంబానికి రాంబాబు మృతదేహన్ని అప్పగించారు. ఈ మృతదేహనికి అంత్యక్రియలు కూడ నిర్వహించారు. కరోనా సోకిన వ్యక్తి మృతదేహం మాత్రమే ఈ ఆసుపత్రి మార్చురీలో ఉంది. రాంబాబు మృతదేహం మార్చురీలో లేకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.

ఆసుపత్రివర్గాలు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని రాంబాబు బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడ కరోనా సోకిన రోగులను రోడ్డుకు పక్కనే పూడ్చిన ఘటనలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.