ముఖ్యమంత్రి నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం  ఇపుడు వివిఐపి నియోజకవర్గం  ప్రభుత్వ నిధులకు ప్రయివేటు పెట్టుబడులకు కుప్పం తాజా గమ్యం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పానికి మరొక భారీ వరమిచ్చారు. ఈ సారి కుప్పంలో రూ. 700 కోట్లతో రోజుకు 100 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్ధ్యంతో రష్యా భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల శుద్ధి కర్మాగారం ఏర్పాటవుతుంది.

భారత దేశంలో వివిఐపి హోదా అసెంబ్లీ నియోజకవర్గాలలో కుప్పం ఒకటి. ఈ దేశంలో ఒక నియోజకర్గం అభివృద్ధి చెందాలంటే దానికి విఐపి లేదా వివిఐపి హోదా అవసరం. ఈ నియోజవకర్గానికి ముఖ్యమంత్రన్నా లేదా ముఖ్యమంత్రి కుటుంబసభ్యుడయినా ప్రాతినిధ్యం వహిస్తేనే అది సాధ్యం. అపుడు ’బంతి’ లో ఎక్కడ కూర్చున్నా మనకు ముందు వడ్డిస్తారు.

ప్రతి ముఖ్యమంత్రికి ఒక నియోజకవర్గం ఉన్నా 1956 నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్లెవరూ తమ నియోజకవర్గాలను ’ఒట్ల గూడెం’ మార్చుకునేందుకు పెద్దగా ప్రయత్నాలు చేసినట్లు కనిపించదు. ఆంధ్రకు సంబంధించి విఐపి నియోజకవర్గం సంప్రదాయం అనేది కుప్పంతోనే ప్రారంభమయింది. 1999-2004 మధ్య కుప్పం అంతర్జాతీయ ఖ్యాతికెక్కంది. ముఖ్యమంత్రి ప్రయోగాలన్నింటికి కేంద్రమయింది. 2004 లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సీన్ కడప జిల్లా ఇడుపుల పాయకు మారింది. ఆయన అనంతం ముఖ్యమంత్రి అయిన రోశయ్య కౌన్సిల్ సభ్యుడు కాబట్టి విఐపి నియోజకవర్గం స్థాపనకు పూనుకోలేదు.

తర్వాత ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పీలేరును వివిఐపి నియోజకవర్గంగా మార్చాడు. రాష్ట్రంలో మొదలుపెట్టాలను కున్న ప్రతి స్కీం లేదా ప్రాజక్టు పైలట్ ప్రాజక్టు పీలేరుకే వెళ్లింది. అసుప్రతి, ఫైరాఫీస్, రెసిడెన్షి యల్ కాలేజీలు, రోడ్లు,మంచినీళ్లు... ఇలా నిధులన్నీ పీలేరు వైపు ప్రవహించాయి. వీటన్నింటికి పతాక స్థాయి, కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు ప్రకటించిన అరువేల కోట్ల మంచినీటి పథకం. అయితే, చివరకు ఏమయింది. ఆ నియోజరవర్గమే కాదు, చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే ధైర్యం కిరణ్ కుమార్ రెడ్డికి లేకుండా పోయింది. 2014 ఎన్నికల లో పోటీ చేయలేక, విభజన అనంతరం రాజకీయాలలో ఉండనూ లేక కిరణ్ కుమార్ రెడ్డి మాయమయ్యారు. ఇపుడు కుప్పం పునరుధ్ధరణ జోరుగా సాగుతూ ఉంది. నిజానికి కుప్పం ఎపుడో వివిఐపి క్లబ్ లో చేరింది. కాని 2004 లో రాజశేఖర్ రెడ్డి రావడం, ప్రపంచ బ్యాంకు ప్రయోగాలు బాగా అపకీర్తి పాలు కావడం కుప్పం మరుగున పడింది. ఇపుడు కుప్పం అభివృద్ధికి ప్రత్యేక బోర్డు, అధికారులు ఉన్నారు. ఈ కుప్పం అభివృద్ధి వికేంద్రీకరణమయిన ఇతర బాగా వెనకబడిన ప్రాంతాలకు విస్తరిస్తే బాగుంటుంది. అలా జరగుతుందునకోవడం అత్యాశేనేమో.

ఇపుడు ప్రభుత్వంలో లో కప్పం అనేది మూడు మాత్రల మంత్రాక్షరి . ప్రభుత్వంలో కు ప్పం అని జపించి, నీళ్లడిగానా, రోడ్డగినా, ప్రభుత్వాసుపత్రి ఎక్కువ పడకలడినా ఆకాశం నుంచి వూడిపడతాయి. కుప్పంలో లేనిదేది లేకుండా చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తున్నారు. ఇందులో భాగమే ఇప్పటి ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్లాంట్. 2014 జూన్ నుంచి ఇప్పటిదాకా కుప్పానికి ప్రకటించిన వరాలు కుప్పలు కుప్పలు.

చిత్తూరు జిల్లాలో రైతులు అత్యధికంగా టొమేటో పండిస్తూ మార్కెట్ ఒడిదుడుకులతో నష్టపోతున్నారు. రైతుల్ని ఆదుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలు, రష్యా భాగస్వామ్యంతో కుప్పంలో వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించాలనున్నారు. దీని ఫలితమే రష్యాకు చెందిన నెవ్‌సాక్యా-కో రష్యా’, మన రాష్ట్రానికి చెందిన శివసాయి గ్రూప్ సంయుక్తంగా నెలకొల్పే ఈ కర్మాగారం. ఇక్కడ టొమేటోతో పాటు ఉల్లి, మిర్చిని కూడా ప్రాసెసింగ్ చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 చిత్తూరు జిల్లాలో అత్యధికంగా, అనంతపురం జిల్లాల్లో కొంతమేర టొమేటో రు. డిమాండ్ లేనప్పుడు, ధరలు పడిపోయినప్పుడు టొమేటోలను వృధాగా పారబోస్తారని, రైతులు ఇలా నష్టపోకూడదనే ఉద్దేశంతో తాము ఈ ప్రాసెసింగ్ యూనిట్ రావటానికి కృషి చేశామని ముఖ్యమంత్రి ఈ విషయం వెల్లడిస్తూ వివరించారు.

ఇటువంటి మరిన్ని యూనిట్లు ఏర్పాటయితే రైతులు అత్యధిక లాభాలు కళ్లజూస్తారని సీఎం చెప్పారు. టొమేటాలను ప్రాసెస్ చేసి టొమేటా పేస్టును ఎగుమతి చేయటం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

శివసాయి గ్రూప్, రష్యా కంపెనీ నెవ్‌సాక్యా-కో రష్యాసంయుక్తంగా మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. శివసాయి గ్రూప్ గత తొమ్మిదేళ్లుగా ఉత్పత్తి, ఎగుమతి రంగాల్లో, ప్రత్యేకించి ఆహార శుద్ధి రంగంలో, పండ్ల ఎగుమతిలో రష్యాతో కలసి పనిచేస్తోంది.

నెవ్‌సాక్యా-కో రష్యాకంపెనీ సెయింట్ పీటర్స్ బర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దిగుమతులు, పంపిణీ వ్యాపారంలో రష్యా అంతటా విస్తరించింది. ఏటా 3.6 లక్షల టన్నుల ఉత్పత్తుల దిగుమతి సామర్ధ్యం ఈ కంపెనీకి ఉంది. కుప్పంలో నెలకొల్పనున్న పరిశ్రమ రోజుకు 100 మెట్రిక్ టన్నుల కూరగాయలను శుద్ధిచేయగల సామర్ధ్యంతో నెలకొల్పుతున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల రష్యాలో పర్యటించి ఇన్నో ప్రోమ్లో పాల్గొని రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఆయన పర్యటన సత్ఫలితాలనిస్తోంది అనటానికి ఈ ఫుడ్ పార్కు ఒక నిదర్శనం. సమీప భవిష్యత్తులో వందలాది పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు.

 సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణకిశోర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, వైష్ణవి గ్రూప్ ఎండి శరత్ డైరెక్టర్ గెన్నాడ్లీ ఫ్రాంకెల్, లెవనిన్ సెర్జీ , నెవస్క్యా, క్యూబన్ గవర్నమెంట్ యూనివర్శిటీ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ (రష్యా) డీన్ డా. ఇలినోవా స్వెట్లానా, శివసాయి ఎక్స్‌పోర్ట్స్ మేనేజింగ్ ,పార్ట్‌నర్ చెరుకూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.