మంత్రి రోజాా, అమర్నాథ్ పై మాజీ మంత్రి, టిడిపి నేత కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు అక్రమం కాకుంటే ఎందుకు ఎవ్వరినీ అనుమతించడం లేదని ప్రశ్నించారు. 

మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు ఒళ్లు బలిసిన మాటలు మాట్లాడితే సహించేది లేదని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర హెచ్చరించారు. విశాఖపట్నం రుషికొండపై అక్రమ నిర్మాణాలు చేపడుతూనే బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు గీతం యూనివర్సిటీ కోసం ప్రభుత్వ భూములు కబ్జా చేసారని ఆరోపించడం విడ్డూరంగా వుందన్నారు.గీతం డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన, ప్రపంచానికి మేధావులను అందిస్తున్న విద్యాసంస్థ గురించి రోజా మాట్లాడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నోరు పారేసుకుంటున్న మంత్రులు చెప్పు దెబ్బలు తినే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. 

ఏపీ ప్రజలు నమ్మకంతో అధికారాన్ని అప్పగిస్తే జగన్ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ వైజాగ్ సముద్ర తీరంలోని రుషికొండలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టడం దారుణమని రవీంద్ర అన్నారు. 

వీడియో

న్యాయస్థానాల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా రుషికొండపై అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వాటిని పరిశీలించడానికి పవన్ వెళ్ళారని అన్నారు. నిజంగానే కొండపై చేపడుతున్నవి నిర్మాణాలు సక్రమమే అయితే పవన్ ను అడ్డుకోడానికి ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు. మంత్రులు రోజా, అమర్నాధ్ లు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటని రవీంద్ర అన్నారు. 

Read More రుషికొండ నిర్మాణాలపై రచ్చ.. సెక్రటేరియట్ అంటూ చేసిన ట్వీట్ డిలీట్ చేసిన వైసీపీ.. అసలేం జరిగిందంటే..!

రిషికొండపై సచివాలయం నిర్మాణం చేపడుతున్నామని నిన్న వైసిపి అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని మాజీ మంత్రి గుర్తుచేసారు. ఇవాళ ఆ పోస్ట్ ను డిలీట్ చేసారంటే వారు రుషికొండపై ఏవో కుట్రలు చేస్తున్నట్లు ప్రజలకు అర్దమవుతోందన్నారు. మీరు చేసే తప్పులను బయట పెడతాం... ప్రజలకు వివరిస్తామని అన్నారు. పనిమాలిన చెత్త మాటలు మాట్లాడితే వదిలిపెట్టబోం... మీరు చెప్పుదెబ్బలు తినే రోజులు దగ్గర్లోనే వున్నాయని రవీంద్ర హెచ్చరించారు. 

పదవుల కోసం రోజా, అమర్నాథ్ వంటివారు నోటికొచ్చిటనట్లు మాట్లాడుతున్నారని రవీంద్ర ఆరోపించారు. పర్యాటకశాఖ మంత్రిగా రోజా ఏం అభివృద్ది చేసిందో చెప్పాలన్నారు. మంచి సూచన చేసిన చిరంజీవిపై కూడా సిగ్గు లేకుండా వాగుతారా అంటూ వైసిపి నాయకులపై మండిపడ్డారు. వైసిపి పాలనతో ప్రజలు విసిగిపోయారు.. తప్పుకుండా తరిమి కొడతారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లను దూషిస్తున్నవారు తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి రవీంద్ర హెచ్చరంచారు.