జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా విశాఖపట్నంలోని రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. దీంతో రుషికొండపై నిర్మాణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా విశాఖపట్నంలోని రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. దీంతో రుషికొండపై నిర్మాణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. చట్టాలను పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి.. ఆయనే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజలందరికీ తెలియాలని రుషికొండపై కట్టడాలను పరిశీలించిన తర్వాత పవన్ కామెంట్ చేశారు. తెలంగాణను దోపిడీ చేశారని.. అందుకే అక్కడ తరిమి కొడితే.. ఇప్పుడు ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానులు అంటున్నారని.. ఒక్క రాజధానికి కూడా దిక్కులేకుండా చేశారని విమర్శించారు. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందో లేదో చెప్పాలని పవన్ కల్యాణ్ కోరారు. జగన్‌కు ఎన్ని ఇళ్లు కావాలి? అని ప్రశ్నించారు. 

అయితే పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని అనుమతులతోనే విశాఖపట్నంలో రుషికొండ వద్ద నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని చేయడం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు ఇష్టం లేదని.. అందుకే విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండపై ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని.. అయితే ఈ నిర్మాణాలను ఆపేయాలని ఏకోర్టు అయినా తీర్పులుచ్చాయా? అని ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే, రుషికొండపై సెక్రటేరియట్ నిర్మిస్తున్నట్టుగా అధికార వైసీపీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు కూడా చేసింది. అయితే ఒక్క రోజులోనే ఆ ట్వీట్‌ను తొలగించిన వైసీపీ.. పొరపాటున పేర్కొనడం జరిగిందని తెలిపింది. తొలుత వైసీపీ.. ‘‘ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్.. రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు. దాని మీద టీడీపీ దుష్ప్రచారం చూస్తుంటే వారికి ఉత్తరాంధ్ర అభివృద్ది చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’’ అని టీడీపీపై విమర్శలు గుప్పించింది. 

Scroll to load tweet…

Scroll to load tweet…

రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నట్టుగా అధికార వైసీపీ పేర్కొనడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ అక్కడ చేపట్టే నిర్మాణాలపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో.. వైసీపీ ట్వీట్‌తో అక్కడ సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టారని పలువురు భావించారు. అయితే రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా పొరపాటుగా ట్వీట్ చేసినట్టుగా ఆ పార్టీ తర్వాత తెలిపింది. 

‘‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు’’ అని పేర్కొంది. అంతకుముందు చేసిన ట్వీట్‌ను తొలగించింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ.. ‘‘ఎన్ని కవర్ డ్రైవులు కొట్టినా ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేసావు! థాంక్స్ బ్రో!’’ అని కౌంటర్ ఇచ్చింది.