వైసిపి అధికారంలో ఉండగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు కొడాలి నాని. ఇప్పుడు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది.. ఇందులో నిజమెంత?
Kodali Nani : ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్దన్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, నందిగాం సురేష్ వంటివారిని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసారు.
ఇంకా చాలామంది వైసిపి నాయకులపై కూడా పోలీస్ కేసులు నమోదయ్యయి... కొందరు కోర్టుల నుండి ముందుస్తు బెయిల్ తెచ్చుకుంటే మరికొందరు అరెస్టుల నుండి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే తాజాగా మాజీ మంత్రి, గుడివాడ వైసిపి నాయకులు కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజదాని కోల్‌కతా ఎయిర్ పోర్టులో ఏపి పోలీసులు కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాతో తెగ ప్రచారం జరుగుతోంది. బెంగళూరు నుండి చెవిరెడ్డి, కోల్‌కతా నుండి కొడాలి నాని శ్రీలంకకు పరారయ్యేందుకు సిద్దమయ్యారని... ఈ విషయం తెలిసి పోలీసులు వారిని అరెస్ట్ చేసారని ప్రచారం జరుగుతోంది. అయితే చెవిరెడ్డిని అరెస్టుచేసిన మాట నిజమే కానీ కొడాలి నానిని అరెస్టు తప్పుడు ప్రచారమని పోలీసులు ప్రకటించారు.
కొడాలి నాని అరెస్ట్ ప్రచారంపై విచారణ చేపట్టారు పోలీసులు. ఆయనను కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. ఇలా తప్పుడు పోస్టులు చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేవారిని గుర్తించేపనిలో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.
