ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, వైసిపి కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Chevireddy Bhaskar Reddy Arrest : ఆంధ్ర ప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ వివిధ కేసుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసారు.

గత వైసిపి హయాంలో మద్యం పాలసీ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని ప్రస్తుత టిడిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో వైసిపి ముఖ్యనాయకులతో పాటు అధికారుల పాత్ర కూడా ఉందని అనుమానిస్తోంది ప్రస్తుత టిడిపి ప్రభుత్వం. దీంతో ఈ లిక్కర్ స్కాం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటుచేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సిట్ అధికారులే తాజాగా చెవిరెడ్డిని అరెస్ట్ చేసారు.

లిక్కర్ స్కాంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసిపి నాయకుడు చెవిరెడ్డి పాత్ర ఉందని సిట్ తేల్చింది. అందుకే అతడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్దమవగా అతడు అందుబాటులో లేకుండాపోయారు. దీంతో చెవిరెడ్డి దేశంవిడిచి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీచేసారు పోలీసులు.

అయితే తాజాగా చెవిరెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో గుర్తించిన ఎయిర్ పోర్ట్ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బెంగళూరు నుండి విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు చెవిరెడ్డి శ్రీలంక వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం. బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ముందుగా విజయవాడలోని లోని సిట్ కార్యాలయానికి తరలించి విచారించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.