కియా ప్లాంట్ అనంతపురం జిల్లా నుంచి తరలి వెళ్తుందన్న వార్తల్లో నిజం లేదన్నారు ఆ కంపెనీ ఎండీ. ఏపీ నుంచి తమ పరిశ్రమ ఎక్కడికి వెళ్లడం లేదని.. పరిశ్రమ అక్కడే కొనసాగించడంపై తాము అంకిత భావంతో ఉన్నామని ఆమె చెప్పారు. అనంతపురం ప్లాంట్ నుంచి ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేస్తామని ఆమె వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం కియా పరిశ్రమ తమిళనాడుకు వెళ్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండిపడగా.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సైతం వివరణ ఇచ్చాయి.

Also Read:కియో కోసం ఎంతో కష్టపడ్డా.. షిఫ్టింగ్ వార్త బాధ కలిగించింది: చంద్రబాబు

అనంతరం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రచారంపై కియా వాళ్లే బాధపడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల వల్ల కియా యాజమాన్యం, ఉద్యోగస్థుల్లో లేనిపోని భయాందోళనలు చెలరేగుతాయని.. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కియా బోర్డు కసరత్తు చేస్తోందని గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

ప్రతిష్టాత్మక రాయిటర్స్ సంస్థ ఇలాంటి వార్తను ప్రచురించడం వల్ల షేర్ల ధరలపై ప్రభావం చూపుతుందన్నారు. తమ ప్రత్యర్థులు తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని కియా యాజమాన్యం భావిస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Also Read:రద్ధులు, కూల్చివేతలు, తరలింపులకు ఫలితం ఇదే: కియా తరలిపోవడంపై పవన్ వ్యాఖ్యలు

పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు తమ ప్రభుత్వం నుంచి అందిస్తామని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ నుంచి ఒక్క పరిశ్రమ కూడా వెళ్లదని.. ఇంకా పరిశ్రమలు వచ్చేలా తాము చర్యలు తీసుకుంటామని గౌతంరెడ్డి వెల్లడించారు.