ఒంటరిగా పోటీ చేసే పక్షంలో పలువురు కాపు నేతలు పవన్ తో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజారాజ్యం అనుభవమే వారిని ఇంకా కలవరపెడుతున్నది.
కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ వైపే చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే విషయంపైనే చర్చ జరుగుతోంది. జనసేన తరపున అభ్యర్ధులు పోటీ చేసే విషయంలో స్పష్టత లేకపోయినా తాను పోటీ చేసే విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
జనసేన ఆవిర్భావం నుండి ఆ పార్టీపై ప్రజల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో సూన్యత ఉందన్న విషయాన్ని జనసేనాధీశుడు గ్రహించినట్లు సమాచారం. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీ తప్ప రాష్ట్రంలో మరే పార్టీ లేన్నట్లే. ఉండటానికి భాజపా తెలుగుదేశానికి మిత్రపక్షమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్ధితి ఏమిటో కమలనాధులకే అర్ధం కావటం లేదు.
ఇక, కాంగ్రెస్, వామపక్షాలను పట్టించుకునే వారే లేరు. అనేక కారణాల వల్ల టిడిపి పై ప్రజల్లో బాగా వ్యతిరేకత ప్రబలుతోంది. అదే సమయంలో వైసీపీ పట్ల ప్రజల్లో పెద్ద సానుకూలత వ్యక్తం అవుతున్న సూచనలూ పెద్దగా కనబడటం లేదు. ఈ పరిస్ధితిల్లో తాను రంగంలోకి దిగితే ప్రజల మద్దతు తప్పకుండా లభిస్తుందన్న నమ్మకంతో పవన్ ఉన్నారు.
అయితే, పవన్ రాజకీయంగా వేసే అడుగులుపైనే జనసేన భవిష్యత్ ఆధారపడి వుంది. అంటే, చంద్రబాబుతో కలుస్తారా లేక ఒంటిరిగా పోటీ చేస్తారా అన్న క్లారిటీ కోసం కాపు సామాజిక వర్గం ఎదురుచూస్తోంది. ప్రస్తుతానికైతే కాపు యువతలో పవన్ వైపు మొగ్గున్నట్లు సమాచారం.
ఒకవేళ జనసేన గనుక టిడిపితో కలిస్తే పవన్ కు నష్టమే కానీ లాభం ఏమీ ఉండదని తెలుస్తోంది. ఈ విషయాన్ని పవన్ కూడా గ్రహించినట్లు సమాచారం. అందుకనే కాపు సామాజిక వర్గంలో మండల స్ధాయి నుండి రాష్ట్రస్ధాయి వరకూ చురుకుగా పనిచేస్తున్న నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే పక్షంలో పలువురు కాపు నేతలు పవన్ తో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజారాజ్యం అనుభవమే వారిని ఇంకా కలవరపెడుతున్నది.
జనసేన పార్టీకి ఇప్పటి వరకూ రంగు, రుచి, వాసన మొత్తం పవనే. పార్టీకి రాష్ట్రస్ధాయి కార్యవర్గాన్ని నియమించాల్సిన అవసరాన్ని పలువురు పవన్ కు వివరించినట్లు సమాచారం. ఆ విషయమై కూడా పవన్ యోచిస్తున్నారు. కార్యవర్గం ఏర్పాటులోనే పవన్ ఆలోచన తెలుస్తుందని పలువురు కాపు నేతలు ఎదురుచూస్తున్నారు.
