గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర పాలన నాజీల పాలనను మించిపోతోందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. రోజుకో దాడి, పూటకో విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి రావణ కాస్టం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తూ, మీడియా ముందు వైసీపీ నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారనే కక్షతోనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం కారుపై దాడి జరిగిందన్నారు. 

''నిన్నటికి నిన్న టీడీపీ నేత సబ్బం హరి ఇంటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ధ్వంసం చేశారు. ప్రశ్నించే వారు, విమర్శించే వారు ఉండకూడదు అనే క్రూరమైన మనస్తత్వంతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాలో విధ్వంసకరమైన కార్యక్రమాలు జరిగాయి. కక్షలు, కార్పన్యాలు రాజ్యమేలుతున్నాయి'' అన్నారు. 

హైకోర్టు న్యాయమూర్తి ఇంటిపక్కనే వున్నా... రక్షనేది: దాడిపై పట్టాభిరాం (వీడియో)

''ఏడాదిన్నర జగన్ రెడ్డి పాలనలో వందలాది మందిపై దాడులు జరిగాయి. తప్పుడు కేసులతో పదుల సంఖ్యలో టీడీపీ నాయకులను వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టడానికి బెటాలియన్లను పంపిస్తున్న పోలీస్ బాస్.. వైసీపీ నేతలు చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించం లేదు.? ఎందుకు కేసులు పెట్టడం లేదు.? డీజీపీ ఉన్నది రాష్ట్ర ప్రజలను కాపాడడానికా.. లేక జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తి రాష్ట్రాన్ని నాశనం చేయడానికా.?'' అని నిలదీశారు. 

''పట్టాభిరాం కారుపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. హైకోర్టు న్యాయమూర్తులు ఉండే చోటనే ఇలా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు.? ఇప్పటికైనా పోలీసులు స్పందించకుంటే రాష్ట్ర స్థాయి ఉద్యమం మొదలవుతుందని గుర్తుంచుకోవాలి'' అని కళా వెంకట్రావు హెచ్చరించారు.