గుంటూరు: రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తన నియంతృత వైఖరిని నెగ్గించుకున్నట్లైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ప్రజలు కోరుకున్న రాజధాని అమరావతికి ఆనాడు నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారని గుర్తుచేశారు. అలాంటిది నేడు కేవలం ఆయన నిరంకుశ వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. 

''ప్రజలు కోరుకున్న దానిని అందించకుండా జగన్మోహన్ రెడ్డి స్వార్థంతో, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవితవ్యం అగాధంలో పడింది. ఈ నష్టం పూడ్చలేనిది. కుట్రపూరితంగా మొదటి నుంచి వైకాపా ప్రజా రాజధాని అమరావతిని చంపాలని చూసింది. ప్రజలు, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టారు. రాష్ట్ర చరిత్రలో నేడు చీకటిరోజుగా మిగిలిపోయింది'' అని అన్నారు. 

read more   అమరావతి కోసం...ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలి: టిడిపి ఎమ్మెల్యే డిమాండ్

''విశాఖ, కర్నూలుపై జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ప్రేమ లేదు. విశాఖలో తన భూదందా కోసమే అమరావతిని చంపేస్తున్నారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. రాజధాని విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాలరాయడం అంటే.. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినట్లే'' అన మండిపడ్డారు.

''దేశ చరిత్రలో ఎవరూ ఈ విధంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి నియంత విధానాలను ప్రతిఒక్కరూ నిరసించాలి. రాష్ట్ర భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేనిపక్షంలో చరిత్ర క్షమించదు'' అని కళా వెంకట్రావు హెచ్చరించారు.