గుంటూరు: సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగేలా ఏకపక్షంగా జరిగిన ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. 

''ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు చీకటి రోజు. హైకోర్టు, సుప్రీం కోర్టు, సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉన్న రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తును నాశనం చేయడమే'' అని మండిపడ్డారు. 

''అసలు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉన్న బిల్లుపై నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. అమరావతిని నాశనం చేయాలి అనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. జగన్ రెడ్డికి అభివృద్ధి చేతకాదు, పాలనకు పనికిరారు'' అని విమర్శించారు. 

read more   ముందుగా విశాఖకు సీఎం కార్యాలయమే... ముహూర్తం ఇదే..

''అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే లక్షలాది ఉద్యోగాలు, రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని ఇలాంటి దుర్మార్గపు కుయుక్తులు పన్నారు. జగన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించడం లేదు. అయినా మొండిగా వెళ్తున్నారు'' అని అన్నారు.

''రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయంతో ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తాం'' అని అనగాని హెచ్చరించారు.