ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో పవిత్రంగా పూజించే దేవతామూర్తి విగ్రహ ధ్వంసం ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని టిడిపి నాయకులు కళా వెంకట్రావు డిమాండ్ చేసారు. 

గుంటూరు:‎ విజయనగరం జిల్లాలోని ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రం రామతీర్ధం (ramateertham)లో శ్రీరాముడి (lord sriram) విగ్రహం ద్వంసం జరిగి ఏడాదవుతున్నా నిందితుల్ని పట్టుకోలేకపోవటం హిందూమనోభావాలు దెబ్బతీయటమేనని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు కిమిడి కళా వెంకట్రావు (kala venkat rao) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి (ys jagan)కి దేవాలయాల ఆస్తుల మీద ఉన్న శ్రద్ద వాటి భద్రత, అభివృద్దిపై లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రామతీర్ధం ఘటనపై సీబీఐ (CBI) విచారణ జరిపి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కళా వెంకట్రావు డిమాండ్ చేసారు.

''ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలోని బోడికొండపై 400 ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు‎ ధ్వంసం చేసి సంవత్సరం పూర్తవుతోంది. కానీ ఇంతవరకు నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోవటం హిందువులను అవమానించటం, వారి మనోభావాల్ని దెబ్బతీయటమే. మర్దర్ జరిగినా 24 గంటల్లో పట్టుకునే టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కోట్లాదిమంది భక్తులు నిత్యం పూజించే శ్రీరాముడి విగ్రహం ద్వంసం చేస్తే నిందితులను ఇంతవరకు పట్టులేకపోవటం ‎వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, జగన్ రెడ్డి హిందూమతం మట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి ఇదే నిదర్శనం'' అని కళా మండిపడ్డారు.

''వైసిపి ప్రభుత్వం ఏర్పడి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు, విగ్రహ ద్వంసం ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 230 పైగా దేవాలయాలపై దాడులు జరిగినా ఇంతవరకు ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకోలేదంటే అర్ధం ఏంటి?'' అని నిలదీసారు. 

read more రామతీర్ధం ఘ‌ట‌న‌లో వైసీపీ, టీడీపీలదే బాధ్య‌త.. బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

''రాష్ట్రంలో మొదటి సారి దేవాలయంపై దాడి జరిగినపుడే నిందితులపై చర్యలు తీసుకుంటే మిగతా దేవాలయాలపై ఇన్ని దాడులు జరిగేవా? అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ ఏమైంది? ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారు?'' అని కళా ప్రశ్నించారు. 

''వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దేవాలయాలను అభివృద్ది చేయకపోగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా చోద్యం చూడటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దేవాలయాల ఆస్తులు, భూములు మీద ఉన్న శ్రద్ద దేవాలయాల భద్రత, అభివృద్దిపై లేకపోవటం సిగ్గుచేటు. జగన్ రెడ్డికి తన స్వార్దం కోసం మతాల మద్య విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటమే తెలుసు. మత సామరస్యాన్ని ఎలా కాపాడాలో జగన్ రెడ్డికి తెలియదు'' అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మండిపడ్డారు.

read more రామతీర్థం రగడ : ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు

ఇదిలావుంటే ఇటీవల రామతీర్థం ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఆలయ పునర్మిరాణ శంకుస్థాపనను ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు (Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. శంకుస్థాపన ఫలకాలు ప్రభుత్వం తరఫున ఏర్పాటుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ శిలాఫలకాలను తోసేశారు. ఈ క్రమంలోనే అధికారులు, అశోక్‌గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. 

శ్రీకోదండరామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు ఆటంకం కల్గించారని ఆలయ ఈఓ నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ఆశోక్ గజపతిరాజుపై 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులను సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు.