Asianet News TeluguAsianet News Telugu

అందుకోసమే అమరావతి నుండి విశాఖకు...జగన్ ఒప్పుకోవాలి..: కళా వెంకట్రావు

దేశంలో ఒక రాష్ట్రం ఏర్పడి రాజధాని ఇది అని నిర్ణయించిన తర్వాత మార్చడం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? అని ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు.

kala venkat rao comments on three capitals issue
Author
Guntur, First Published Aug 5, 2020, 9:36 PM IST

అమరావతి: దేశంలో ఒక రాష్ట్రం ఏర్పడి రాజధాని ఇది అని నిర్ణయించిన తర్వాత మార్చడం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? అని ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రజల అభీష్టానికి విరుద్ధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు అని నిలదీశారు. 

''151 సీట్లు వచ్చాయి, ఎదురులేని ప్రజా బలం ఉందని చెప్పుకుంటున్న జగన్ ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు.? ఏ ప్యాలస్ లో పబ్జీ ఆడుకుంటున్నారు.? మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని ఆయన భావిస్తే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం రండి. అభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ అంటున్న ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయం తీసుకుందామంటే ఎందుకు వెనకాడుతున్నారో సమాధానం చెప్పాలి'' అని అన్నారు. 

''మొన్నటి ఎన్నికల్లో మీ గెలుపునకు ప్రజల ఓట్లే కారణమని నిరూపించుకుని గెలుపుపై చిత్తశుద్ధిని చాటుకోండి. మాట తప్పితే రాజీనామా చేసే రకమైన విలువలు రాజకీయాల్లో ఉండాలని ఎన్నికల ముందు ప్రకటించారు. నాటి మీ ప్రకటన మేరకు అమరావతిపై మాట తప్పి ప్రజల్ని మోసం చేసినందుకు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు.? అమరావతే రాజధానిగా ఉంటుందని నాడు హామీలిచ్చి నేడు మాట మార్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు.?'' అని నిలదీశారు. 

read more   భారీ ఉద్యోగాల భర్తీ...: కోవిడ్19పై సమీక్షా సమావేశంలో మంత్రి అవంతి

''రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చి నేడు విశాఖలో కబ్జా చేసిన భూముల కోసం మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి గారూ ఇవేనా చెప్పిన రాజకీయ విలువలు.? నియంతృత్వ వైఖరితో తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే ప్రజలకు ముఖం చాటేస్తున్నానని ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి. మాట తప్పను.. మడమ తిప్పను అనే మాటతో ప్రజల్ని మాయ చేసి అధికారంలోకి వచ్చి మాట తప్పినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని గుర్తుంచుకోండి'' అని హెచ్చరించారు. 

''చంద్రబాబు నాయుడు సవాల్ స్వీకరించి అసెంబ్లీని రద్దు చేయండి. మీ మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని ప్రజలు అంగీకరించి మీకు మళ్లీ అధికారం ఇస్తే మేం ఇంకేం మాట్లాడం. లేని పక్షంలో న్యాయపోరాటం కొనసాగుతుందని గుర్తుంచుకోండి'' అని కళా వెంకట్రావు వెల్లడించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios