మొట్టమొదటసారిగా ఏపి ఎంపిలు పార్లమెంటు ముందు ఆందోళనకు దిగారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని, రాష్ట్రప్రయోజనాలు కాపాడాలంటూ  టిడిపి, వైసిపి ఎంపిలు సంయుక్తంగా నిరసనలు మొదలుపెట్టారు. రెండు పార్టీల ఎంపిలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ఆవరణలోని గాంధి విగ్రహం వద్దే కాకుండా పార్లమెంటు ముఖద్వారం వద్ద నిరసన చేస్తున్నారు.

ప్రత్యేకహోదా కోసం మొదటి నుండి వైసిపి ఎంపిలు ఆందోళనలు నిర్వహించినపుడు టిడిపి, బిజెపి ఎంపిలు పట్టించుకోలేదు. రాజ్యసభ, లొక్ సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చినపుడు, కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చినపుడు కూడా టిడిపి ఎంపిలు వైసిపితో కలవలేదు. అదే సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేటు మెంబర్ బిల్లు తెచ్చి చర్చకు పట్టినపుడు కూడా టిడిపి ఎంపిలు కలవలేదు.

మూడున్నరేళ్ళ పాటు కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఇపుడు హడావుడిగా విభజన హామీలని, రాష్ట్రప్రయోజనాలని నానా హడావుడి మొదలుపెట్టింది. అందుకు ప్రధానకారణం త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అనటంలో సందేహం అవసరంలేదు. టిడిపి వ్యవహారం ఒకవిధంగా ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు’ గానే ఉంది. ఇపుడు కూడా రాష్ట్ర ప్రయోజాల కోసం చంద్రబాబునాయుడు అఖిలపార్టీ సమావేశం నిర్వహించటానికి ఇష్టపడటం లేదు. మొత్తానికి టిడిపి, వైసిపి ఎంపిల ఆందోళనలు, నిరసనలతో రాజ్యసభ, లోక్ సభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి.