చిత్తూరు ఎంపి శివప్రసాద్, రాజమండ్రి ఎంఎల్ఏ బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్, కేశినేని నాని లాంటి వారు చేసిన వ్యాఖ్యలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఎవరిమీదైనా చర్యలు తీసుకోవాలంటే వారంతా ఇతర పార్టీల్లో ఎక్కడ చేరిపోతారో అన్న అధినేత భయమే ఇటువంటి వారికి శ్రీరామరక్ష.

కొంతమంది అంతే. ఎక్కడా ఇమడలేరు. ఎవరితోనూ ఎక్కువ కాలం పొసగదు. అటువంటి వారిలో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి ముందు వరసలో ఉంటారు. ఇటువంటి వారిని ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ కూడా భరించలేందు. రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ అనుబంధాన్ని జెసి సోదరులు హటాత్తుగా తెంచేసుకున్నారు. దశాబ్దాల సహచర్యంలో విచ్చలవిడితనం బాగా అలవాటైపోయింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆయన చెప్పిన ప్రకారమే వేరే దారిలేక తెలుగుదేశం పార్టీలో చేరారు.

టిడిపిలో అయితే చేరారు కానీ ఇమడలేకపోతున్నారు. ఇంటాబయట మాట చెల్లుబాటు కావటం లేదు. జిల్లాలోని మెజారిటీ నేతలు జెసి సోదరులకు వ్యతిరేకం. పలువురు నేతలతో నిత్యమూ వివాదాలు. క్రమశిక్షణలో కాంగ్రెస్ కు టిడిపికి ఒకపుడు బాగా తేడావుండేది. కాంగ్రెస్ లో విచ్చలవిడితనం ఎక్కువ. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షులను తిట్టికూడా మళ్ళీ టిక్కెట్టు తెచ్చుకోలిగినంత స్వేచ్ఛ ఉంది అక్కడ. ఎందుకంటే, కాంగ్రెస్ అన్నది జాతీయ పార్టీ కాబట్టి ప్రతీ ఒక్కరికి ఢిల్లీ స్ధాయిలో ఎవరో ఒకరి అండ ఉంటుంది. కాబట్టే, అక్కడ ఏం చేసినా చెల్లుబాటవుతుంది.

మరి, టిడిపిలో అది సాధ్యంకాదు. ఎందుకంటే, ఇది ప్రాంతీయపార్టీ. ఇక్కడ ఏ-టు- జడ్ ఒక్కరే. అధ్యక్షుని గురించి కానీ పార్టీ గురించి కానీ ఏమన్నా వ్యతిరేకంగా ఒక్క ప్రకటన చేసినా వారి భవిష్యత్తుకు మంగళమే. సరే చంద్రబాబునాయుడు హయాంలో క్రమశిక్షణ తప్పిందనుకోండి అదివేరే సంగతి. దానికితోడు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపిలో మరీ విచ్చలవిడితనం పెరిగిపోయింది.

సరిగ్గా అదే సమయంలో జెసి సోదరులు టిడిపిలో చేరారు. అసలే కాంగ్రెస్ బడిలో చదువుకున్నారు కదా? అందుకే టడిపిలో ఇమడలేకపోతున్నారు. కాకపోతే అదృష్టమేమిటంటే వారు ఎవరిని ఏమన్నా అంతా సర్దుకునిపోతున్నారు. ఇప్పటికి చంద్రబాబును కూడా ఎన్నోమార్లు విమర్శించారు. జెసి దివాకర్ రెడ్డి లేకపోతే ప్రభాకర్ రెడ్డి జీరో అన్న సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా జరిగిన బహిరంగ సభలో కూడా చంద్రబాబును తిట్టారో లేక పొగిడారో కూడా అర్ధం కానట్లు మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పుతుండటం, ప్రతిపక్షం బలంగా ఉండటం ఇలాంటి వారికి బాగా కలసివస్తోంది. చిత్తూరు ఎంపి శివప్రసాద్, రాజమండ్రి ఎంఎల్ఏ బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్, కేశినేని నాని లాంటి వారు చేసిన వ్యాఖ్యలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఎవరిమీదైనా చర్యలు తీసుకోవాలంటే వారంతా ఇతర పార్టీల్లో ఎక్కడ చేరిపోతారో అన్న అధినేత భయమే ఇటువంటి వారికి శ్రీరామరక్ష.