వినతులిచ్చినా పరిష్కారం కానపుడు కార్యక్రమానికి ఎందుకు రావటమని పలు గ్రామాల్లో ప్రజలు అసలు రావటమే మానేసారు.
జన్మభూమి కార్యక్రమం చివరకు పార్టీ నేతల బల ప్రదర్శనకు వేదికగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కార్యక్రమం జరిగిన తంతును చూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం వస్తుంది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఈ విషయం స్పష్టమైంది. కార్యక్రమంలో పాల్గొన్న అధికార పార్టీలోని గ్రూపుల మధ్య అధికారులు నలిగిపోయారు.
ఏ గ్రూపుకు ఆ గ్రూపు తమదే పెత్తనమని చెప్పుకోవటంతో మామూలు జనాలు బిత్తరపోయారు. అనంతపురం, కర్నూలు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో అయితే, ఏకంగా ఇరు వర్గాలు కొట్టేసుకున్నాయి. దాంతో 10 రోజుల జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన వినతులను ఏమి చేయాలో అధికారులకు తోచటంలేదు. ఏ వర్గం తరపున వచ్చిన దరఖాస్తులను పరిష్కారానికి పూనుకున్నా వైరి వర్గంతో అధికారులకు తంటాలే. దాంతో అధికారయంత్రాంగం వచ్చిన దరఖాస్తులను పక్కనబెట్టి కూర్చున్నది.
రాష్ట్రం మొత్తం మీద 10 రోజుల కార్యక్రమంలో సుమారు 8 లక్షల దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఇవికాక ఇంతకుముందు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో అందిన వినతులు మరికొన్ని లక్షలుంటాయి. ఈసారి అందిన 8 లక్షల్లో పరిష్కారానికి నోచుకున్నవి కేవలం 49 వేలు మాత్రమే. మిగిలిన వాటిని కట్టకట్టి పక్కన బెట్టేసారు. దాంతో జన్మభూమి కార్యక్రమం ఉద్దేశ్యమే వీగిపోతోంది. అయినా స్ధానిక పార్టీ నాయకత్వం పట్టించుకోవటం లేదు. వినతులిచ్చినా పరిష్కారం కానపుడు కార్యక్రమానికి ఎందుకు రావటమని పలు గ్రామాల్లో ప్రజలు అసలు రావటమే మానేసారు. మరి, ఈ విషయాలు చంద్రబాబునాయుడు దృష్టికి వెళుతున్నాయో లేవో.
