Asianet News TeluguAsianet News Telugu

జనసేనకు ఉత్తరాంధ్ర జై కొడుతుందా

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు యువతలో వైబ్రేషన్స్....పవన్ మాట వింటే చాలు యువత కేరింత అంతా ఇంతా కాదు.  పవన్ జనసేన పార్టీ పెట్టిన అప్పుడప్పుడు స్పందించే పవన్ కళ్యాన్ ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తారు.

Janasena political plan in uttharandhra
Author
Vishakhapatnam, First Published Aug 16, 2018, 4:13 PM IST

ఉత్తరాంధ్ర: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు యువతలో వైబ్రేషన్స్....పవన్ మాట వింటే చాలు యువత కేరింత అంతా ఇంతా కాదు.  పవన్ జనసేన పార్టీ పెట్టిన అప్పుడప్పుడు స్పందించే పవన్ కళ్యాన్ ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తారు. తర్వాత ప్రజాపోరాట యాత్ర పేరుతో నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాపోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్రను చుట్టేసిన పవన్ కళ్యాణ్ తమ పార్టీ పటిష్టతను పెంచుకోగలిగారా....పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా...ప్రజాపోరాట యాత్ర ముగిసిన తర్వాత ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది....ఓసారి చూద్దాం. 

పవన్ కళ్యాణ్ స్వతహాగానే ఆవేశపరుడిలా ఉంటారు. అదే ఆవేశంతో తన ప్రసంగాలను ఓ కుదుపు కుదిపేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలను తూర్పారపడుతూ కడిగిపారేశారు. అభివృద్ధికి ఆమడ దూరంలో... వెనుకబాటుతనంతో ఉన్నా సమైక్యతనే కోరుకున్న ఉత్తరాంధ్ర ప్రజల్లో తన ప్రసంగాలతో చైతన్యం నింపాడు పవన్. 

ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు పవన్. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసిన పవన్ తన ప్రసంగంలోని వాడి వేడిని యూత్ కు రీచ్ అయ్యేలా పంచ్ లతో ఏకిపారేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తొలగించడానికి పాలకులు ఇప్పటి వరకు శ్రద్ధ చూపలేదని....ఇలాగే ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోరినా ఆశ్చర్యం లేదంటూ గుచ్చి గుచ్చి యువత గుండెల్లోకి చొచ్చుకుపోయేలా గొంతెత్తి అరిచారు. 

తన ప్రసంగాలతో టీడీపీ, వైసీపీలే కాదు జనసేన పార్టీ కూడా ఒకటి ఉందంటూ ప్రజలకు తెలియజేశారు. టీడీపీ, వైసీపీ  ఏదో ఒకటి అనుకుంటున్న ప్రజలకు రెండింటి ప్రత్యామ్నాయం జనసేనేనని ప్రజలు ఆలోచించేలా చేయగలగడంలో సక్సెస్ అయ్యారు. 

 ఓట్ల కోసమే యాత్రలు  చేసే వారికి భిన్నంగా పవన్ యాత్ర సాగింది. రాజకీయ పరిణితని తన యాత్రలో కనబరిచారు. పవన్ అంటే ఆవేశపరుడు అన్నారు కానీ  ఆ ఆవేశాన్ని ఇసుమంత కనిపించనివ్వ లేదు. ఆ ఆవేశం కోరుకునేది ప్రజా సంక్షేమం కోసమే తప్ప వ్యక్తిగతం కాదని అక్కడకక్కడ బదులిచ్చేశారు కూడా. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎంతో ఆవేశంగా మాట్లాడారు. అనుభవం లేకుండా మాట్లాడుతున్నారు అంటూ పెద్ద విమర్శలే వచ్చాయి. ఆ విమర్శలను తిప్పికొట్టేలా తన పర్యటనలో జాగ్రత్త పడ్డారు. 

పార్టీ పెట్టిన నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తన పవరేంటో చూపించారు. తన మద్దతుతో కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించి ఔరా అనిపించుకున్నారు.  2014 ఎన్నికల అనంతరం అప్పుడప్పుడు మెురిపించే పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం లీడర్ అంటూ ఎద్దేవా చేసేవారు. షూటింగ్‌లు లేనప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారంటూ వచ్చిన విమర్శలు లేకపోలేదు. ఎలాంటి విమర్శలు ఎదురైనా నవ్వుతోనే సమాధానం చెప్పేవారు పవన్. 

రాజకీయాలంటే అనుభవంతో కూడుకున్నవి అని బలంగా నమ్మిన పవర్ స్టార్ 2019 ఎన్నికల్లో తన పవరేంటో చూపించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజాకర్షక సమస్యలపై దృష్టి సారించి నిరక్షరాస్యులను సైతం మెప్పిస్తున్నారు. రాజకీయ వేత్తలను సైతం ఔరా అనిపిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఉత్తరాంధ్ర పర్యటన. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువత అయితే చెప్పనవసరం లేదు. విజిల్స్ మోత మోయించారు. 

కానీ ఇదంతా బలమా అంటే కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఉత్తరాంధ్రలో బిసీ వర్గాలు ఎక్కువ. అయితే ఆ వర్గాలను పవన్ కళ్యాణ్ ఎంతోకొంత ప్రభావితం చెయ్యకలిగారని చర్చ అయితే జరుగుతుంది. కానీ టీడీపీకి కంచుకోటలా ఉన్న ఆ ప్రాంతాన్ని చీల్చగలరా అన్న సందేహం లేకపోలేదు. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని ఆశపడ్డ వైసీపీ ఆ తర్వాత బొక్కబోర్లాపడింది.  

టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉత్తరాంధ్రలో పవన్ మూడో ప్రత్యామ్నాయం కావడానికి ఇంకా టైం పడుతుందన్న వాదనలు లేకపోలేదు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లాలో మాజీకేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణ రంగరావులు, విశాఖపట్టణంలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు రాజకీయాలను శాసిస్తున్నారు. ఈనేతలలో ఎక్కువ శాతం బీసీలే కావడం విశేషం. అటు వైసీపీకు సైతం శ్రీకాకుళం జిల్లా మాజీమంత్రి ధర్మాన, విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ, విశాఖపట్టణంలో అమర్ నాత్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతటి ఉద్దండుల రాజకీయాల నుంచి ప్రజలను తమవైపుకు తిప్పుకోవాలంటే పవన్ కు సాధ్యమా అన్న సందేహం నెలకొంది. ఉత్తరాంధ్రలో కనీసం ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కూడా జనసేన పార్టీకి లేకపోవడం...ఇంకొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండటంతో పవన్ రాజకీయం పారుతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మరోవైపు కుల సమీకరణల్లో కొంత ఓటుబ్యాంకు పవన్ వైపు వెళ్లినా అది ప్రభావితం చేసేంత కాదన్నది ఒక వాదన. అయితే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పదేపదే స్థానిక సమస్యలను ప్రస్తావించడం చూస్తుంటే కొన్ని సీట్లయినా దక్కించుకోవాలన్న ఆశ కనడుతుంది. ప్రత్యేకించి ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు అక్కడ దృష్టి పెడితే ఒకటి రెండు సీట్లయినా సాధించవచ్చన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లు కనిపిస్తోంది.
 
ఇకపోతే విజయనగరం జిల్లాలో కూడా స్థానిక సమస్యలనే పదేపదే ప్రస్తావించారు. అయితే జిల్లాల్లో తూర్పుకాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో తొమ్మిది స్థానాల్లో ఒక్కస్థానం అయినా దక్కొచ్చేమోనన్నఆలోచనలో ఉంది జనసేన పార్టీ. ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చెయ్యగలిగే నాయకుడు ఉంటే విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతుంది. 

ఇక విశాఖపట్టణం జిల్లాలో అయితే మన్యంపైనే ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ . పాడేరు, అరకు నియోజకవర్గాలలో గెలుపొందాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా జనసేనలోకి వలసలు రాకపోవడం....జనాకర్షక నేతలు పార్టీలో లేకపోవడంతో జనసేన ప్రభావం అంతగా ఉండదని టీడీపీ, వైసీపీలు భావిస్తున్నాయి. 

ప్రస్తుతానికి ఏ నియోజక వర్గానికి కూడా అభ్యర్థులే లేరు..ఎమ్మెల్యే స్థాయి అంత వ్యక్తులు లేరు....కనీసం ఓటర్లను ప్రభావితం చెయ్యగలిగే నాయకులే లేరు....మరి ఎన్నికల సమయానికి వలసలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. మరి వారి అంచనాలను పవన్ కళ్యాణ్ తిరగరాస్తారా.....2019 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారా లేక ఈసారి కూడా మద్దతుతోనే సరిపెట్టుకుంటారా అన్నది కొద్దిరోజుల్లేనే తేలనుంది. 

 

ఈ వార్తలు కూడా చదవండి

జనసేనలో చీలికలు.. కారణం ఏంటి..? 

పవన్ విడుదల చేసిన జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ పూర్తి పాఠమిదీ

పవన్ జనసేన పిడికిలి గుర్తుపై జూపూడి సంచలన వ్యాఖ్య

కాపు కోటాపై పవన్ కల్యాణ్ వైఖరి: అది ముద్రగడ ప్లాన్?

టార్గెట్ 2019: మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన పవన్

జనసేన పార్టీ గుర్తు పిడికిలి- ప్రకటించిన పవన్ కళ్యాణ్

Follow Us:
Download App:
  • android
  • ios