అమరావతి: పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పిడికిలి గుర్తుపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన గుర్తును పవన్ కల్యాణ్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.

జనసేన పార్టీ పిడికిలి గుర్తు ఐక్యతకు చిహ్నం కాదని, తిరుగుబాటుకు చిహ్నమని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప‌వ‌న్ విషం చిమ్ముతున్నారని జూపూడి తీవ్రస్థాయిలో విమర్శించారు. 

ముఖ్యమంత్రి పదవి కావాలనుకునే రాజ‌కీయ‌ నాయ‌కుడికి ఓర్పు, నేర్పు అవసరమని ఆయన అన్నారు.ప‌వ‌న్‌కు మెంటల్ బ్యాలెన్స్ లేద‌ని జ‌నం భావిస్తున్నారని, నారా లోకేష్‌ను చూసి ప‌వ‌న్, జ‌గ‌న్ వణికి పోతున్నారని ఆయన అన్నారు.

పిడికిలి గుర్తుపై జూపూడి ప్రభాకర్ రావు ఆ వ్యాఖ్య చేయడానికి తగిన నేపథ్యం ఉంది. పిడికిలి ఓ విప్లవ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం పిడిఎస్ యూ గుర్తుగా ఉండేది. భారతదేశంలో ప్రతిఘటనా పోరాటాల స్థితి ఉందని అంచనా వేసి తిరుగుబాటుకు చిహ్నంగా ఆ గుర్తును విద్యార్థి సంఘం పెట్టుకుంది. 

జూపూడి ప్రభాకర రావు ఆ విద్యార్థి సంఘం రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినవారు కాబట్టి ఆ వ్యాఖ్య చేసి ఉంటారు. వామపక్షాల కలిసి నవడానికి పవన్ కల్యాణ్ సిద్ధపడ్డారు కాబట్టి పార్టీ గుర్తుగా పిడికిలిని ఎంపిక చేసుకుని ఉంటారు. పైగా, పవన్ కల్యాణ్ తనలో విప్లవ భావజాలాలున్నాయని పదే పదే చెబుకుంటున్నారు. చేగువేరా అంటే తనకు ఇష్టమని కూడా అన్నారు.