సినీ నటుడు పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీలో చీలికలు మొదలయ్యయా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. నిన్న మొన్నటిదాకా బాగానే ఉన్న పార్టీ నేతల్లో ఒక్కసారిగా చీలికలు మొదలయ్యాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. అందుకు కారణం ప్రజారాజ్యం అని తెలుస్తోంది.

ఇంతకీ  అసలు మ్యాటరేంటంటే..  ఇటీవల పవన్.. పార్టీలో ఏడు జిల్లాలకు కన్వీనర్లను నియమించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను ప్రటించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో బాధ్యులను ప్రకటించనున్నారు. 

అయితే పార్టీ పదవులు ప్రకటించిన జిల్లాలలో స్థానిక ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారట. 2014 నుంచి పార్టీకోసం పనిచేసిన తమకు న్యాయం జరగలేదని వారు ఫీలవుతున్నారట. పవన్‌కల్యాణ్ క్రియాశీలకంగా లేనప్పుడు కూడా తాము జిల్లాల్లో కార్యక్రమాలు చేశామని గుర్తుచేస్తున్నారట. అలాంటి తమను కాదని కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు పదవులు దక్కాయని జనసైనికులు ఆవేదన చెందుతున్నారట.
 
     గత నాలుగేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరించిన వారికంటే ప్రజారాజ్యంలో పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కులాల ప్రస్తావన లేని సమాజ నిర్మాణమే ధ్యేయమని చెప్తోన్న పవన్‌కల్యాణ్ ఒకే సామాజికవర్గానికి చెందినవారికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటివరకూ ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి చెందిన 80 శాతం మందికి పదవులు దక్కాయట! వ్యయప్రయాసలకు ఓర్చి తాము గత నాలుగేళ్ళుగా పార్టీ అస్తిత్వాన్ని కాపాడుతూ వచ్చామనీ.. ‌అలాంటి తమను కాదని వేరే వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వడమేంటనీ కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారని సమాచారం.