ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల జనసేన పార్టీ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని పవన్ కల్యాణ్ ను కోరిన కేఏ పాల్ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అన్న చిరంజీవి బాటలోనే పవన్ కల్యాణ్ నడవనున్నారని... ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లు జనసేనను బిజెపి విలీనం చేయడం ఖాయమని కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేసారు. 

జనసేనను విలీనం చేసేందుకు బిజెపితో పవన్ మంతనాలు కూడా జరిపాడని పాల్ పేర్కొన్నారు. రూ.5వేల కోట్లు, మంత్రి పదవి తీసుకుని జనసేనను బిజెపిలో కలిపేందుకు పవన్ సిద్దమయ్యారని పాల్ ఆరోపించారు. త్వరలోనే బిజెపిలో జనసేన విలీనం ప్రక్రియ ప్రారంభంకానుందని... ఏ క్షణంలో అయినా సంచలన ప్రకటన వుండవచ్చని ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ తెలిపారు.

స్వార్థ రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ లాంటి ప్యాకేజీ స్లార్లు కావాలో లేక నిస్వార్థంగా సేవ చేసే తనలాంటి నాయకులు కావాలో ప్రజలే తేల్చుకోవాలని పాల్ అన్నారు. సినీ హీరోలు కావాలా? రియల్, వరల్డ్ హీరోలు కావాలా? అని ప్రశ్నించారు. నిజ జీవితంలో హీరో అయిన తనకు ప్రజలు మద్దతుగా నిలవాలని కేఏ పాల్ కోరారు. 

Read More జగన్ రెడ్డిది పచ్చి నెత్తురు తాగే ఫ్యాక్షనిజం.. మాది హ్యూమనిజం.. : నారా లోకేష్

ఇదిలావుంటే ఇటీవల జనసేన పార్టీని ప్రజాశాంతిలో విలీనం చేయాలని... అలా చేస్తే తాను సీఎం రేసునుండి తప్పుకుంటానని కేఏ పాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రకటించి ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో లక్ష కోట్లు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుందాం... వచ్చేయ్ పవన్ అంటూ కేఏ పాల్ వ్యాఖ్యలు చేసారు. 

పవన్ కళ్యాణ్‌కు కాపుల మద్దతు లేదని కేఏ పాల్ అన్నారు. కాపులు ఓటేస్తే గెలిచిన చిరంజీవి.. మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌కు అమ్మేశాడని విమర్శించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా పవన్ కళ్యాణ్ వెంట లేరని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు కోటి మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ లక్ష మంది కూడా ఓటేయరని అన్నారు.పవన్ పదిహేను సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు... కానీ తాను ఇటీవలే వచ్చానని కేఏ పాల్ అన్నారు. అయినా తనకే ప్రజల మద్దతు ఎక్కువగా వుందని పాల్ అన్నారు.