అమరావతి: జనసేన పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేయాలని అనుకుంటే ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు నాగబాబు. పార్టీ బలోపేతం చేసేందుకు తనను పార్టీ కో ఆర్డినేషన్ ఇంచార్జ్ గా మరో బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. 

పవన్ కళ్యాణ్ కంటే తాను ఇంట్లో పెద్దవ్యక్తిని అయినా తాను పార్టీ పరంగా ఏనాడు ప్రశ్నించలేదని, ప్రశ్నించబోనన్నారు. నిజమైన పార్టీ కార్యకర్తలు నాయకుడిని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

పవన్ కళ్యాణ్ ను ఎంతో విజన్ ఉన్న నాయకుడు అని ఆయన ఏం చెప్పినా కళ్లు మూసి చేయాల్సిందేనని తిరిగి ప్రశ్నించొద్దంటూ చెప్పుకొచ్చారు. నెవర్ క్వశ్చన్ టూ యువర్ లీడర్ అంటూ హితవు పలికారు. 

అమరావతిలోని పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీ ఒక మహావృక్షం అంటూ చెప్పుకొచ్చారు. జనసేన చెట్టు ఎంత బాగుంటే ప్రజలు, కార్యకర్తలు ఎంతో బాగుంటారని చెప్పుకొచ్చారు. 

జనసేన పార్టీ వృక్షాన్ని బతికిస్తే ఎంతోమంది దాని నీడన బతుకుతారని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీలో ఎంతోమంది నాయకులు తెరవెనుక ఉండి పార్టీని నడిపిస్తున్నారని వారందరికీ తాను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. 

సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి, రాష్ట్రం బాగుపడాలనే నిత్యం పరితపిస్తూ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు పార్టీ అధినేతగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయని అందర్నీ కలుసుకునే అవకాశం లేనప్పుడు తనను కలవాలని సూచించారు. 

గత నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్ ను కేవలం రెండు సార్లే కలిశానని చెప్పుకొచ్చారు. అది కూడా ఫంక్షన్లలో మాత్రమేనన్నారు. పవన్ ఇంటికి వెళ్లి కాళ్లమీద కాళ్లు వేసుకుని కూర్చోవచ్చునని అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల ఆయనను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేకే కలవలేదన్నారు. 

పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మస్త్రం అని అభిప్రాయపడ్డారు. ఆయనను ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగించాలే తప్ప లోకల్ బాణంలా ప్రయోగించొద్దని నాగబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ ను కిందకు గింజొద్దన్నారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, పార్టీ కో ఆర్డినేషన్ కమిటీ ఇంచార్జ్  నాగబాబు.  

ఈ వార్తలు కూడా చదవండి

తలలు, బుగ్గలు నిమరలేను.. ఎన్టీఆర్‌లా నా పక్కన ఎవరూ లేరు: పవన్ వ్యాఖ్యలు