దేశంలో కానీ, ఏపీలో కానీ ఉన్న పార్టీల వెనుక డబ్బుందని కానీ.. ఆశయ బలంతో వచ్చిన పార్టీ జనసేన అన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో పవన్ కల్యాణ్ బుధవారం సమావేశమయ్యారు.

అనంతరం ఆయన వారినుద్దేశించి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తనకు బహుమతిగా ఇస్తానని కొందరు చెప్పారని... అయితే ఆంధ్రప్రదేశ్ బర్త్‌డే కేక్ కాదని పవన్ స్పష్టం చేశారు. 2014లో ప్రధానికాక ముందే నరేంద్రమోడీ తనను ఢిల్లీకి పిలిపించారని జనసేనాని గుర్తు చేశారు.

బుగ్గలు నిమిరి, తలలు నిమిరితే ఓట్లు పడతాయంటే తనకు అలాంటి రాజకీయాలు అవసరం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో జనసేన కవాతు సందర్భంగా కాటన్ బ్యారేజ్‌పైకి పది లక్షల మంది వస్తే దానిని పట్టించుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంత మంది సారా ప్యాకెట్లు, డబ్బు పంచకుండా వస్తే ఎందుకొచ్చారా అని మీడియా అస్సలు హైలెట్ చేయలేదని ఆయన ఆక్రోశించారు. ప్రచారంలో తన చుట్టూ తిరిగిన నేతలు.. నేను వెళ్లిపోగానే ఎవరి పని వాళ్లు చూసుకున్నారని.. అది పార్టీకి నష్టం చేకూర్చిందని పవన్ ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ  పెట్టినప్పుడు అనుభవజ్ఞులు, మేథావులు పక్కన నిలబడ్డారని.. కానీ నా పక్కన ఎవరూ లేరని జనసేనాని వాపోయారు.