Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే రాంబాబు ఆస్తులు పెంచుకొన్నారు: జనసేన

ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నామని అన్నా రాంబాబు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని జనసేన ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఇంచార్జీ షేక్ రియాజ్ చెప్పారు.

Janasena leader shaik riyaz reacts on giddalur MLA anna Rambabu comments lns
Author
Ongole, First Published Jan 25, 2021, 8:40 PM IST

ఒంగోలు: ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నామని అన్నా రాంబాబు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని జనసేన ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఇంచార్జీ షేక్ రియాజ్ చెప్పారు.

ఆస్తులు పెంచుకోవడానికి ఆయన రాజకీయాలు చేశారన్నారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చానని  అన్నా రాంబాబు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసినప్పుడు అఫిడవిట్ లో ఆయన నమోదు చేసిన వివరాల ప్రకారం అప్పట్లో ఆయన ఆస్తులు విలువ కోటి రూపాయలు ఉంటే అప్పులు రెండు కోట్లు ఉన్నాయన్నారు.

 2014లో ఆయన ఆస్తులు రూ. 27కోట్లకు, 2019లో రూ. 42 కోట్లకు పెరిగాయి. కనుక ఆయన ఏ ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేశారో గిద్దలూరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు.

గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మహిళను బెదిరించి ఆస్తులు రాయించుకుంటే... ఆ మహిళ మీ మీద కేసు పెట్టింది. ఆ కేసులో ఎక్కడ శిక్ష ఖరారు అవుతుందో అని భయపడి కొందరు పెద్దల ద్వారా రాజీ చేయించుకొని, ఆమె కాళ్ల మీద పడి తప్పు ఒప్పుకున్న సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు.

also read:పవన్ గెలిస్తే ఏ శిక్షకైనా సిద్దమే, లేకపోతే పార్టీ మూసివేస్తారా?: పవన్‌కి అన్నా రాంబాబు సవాల్

 మీరు బూతులు మాట్లాడుతూ అది సాంప్రదాయమైన భాష అంటున్నారు. రేపు పదవికి రాజీనామా చేసి ఇవే బూతులతో ప్రజలను సంబోధిస్తూ ఓట్లు అడిగితే తెలుస్తుందన్నారు. గిద్దలూరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తే అప్పుడు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలని చూస్తున్నారన్నారు.

 పవన్ కళ్యాణ్ యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. యువతను చెడగొట్టేది అన్నా రాంబాబు, వైసీపీ నాయకులేనని ఆయన చెప్పారు.  అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్తొచ్చిన వ్యక్తి మీ పార్టీ అధ్యక్షులు... ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి పార్టీలో ఉన్న మీరు నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

 అన్నా రాంబాబు పేరిట ఉన్న అసెంబ్లీ స్టిక్కర్ తో ఉన్న కారులో కోట్ల రూపాయల అక్రమ నగదు చెన్నై శివార్లలో పోలీసు తనిఖీల్లో దొరికిన మాట వాస్తవమా కాదా? అని ఆయన ప్రశ్నించారు. 

భూకబ్జాలు చేసి ఆస్తులు కూడగట్టుకున్న మీరు... నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడం నిజంగా సిగ్గుచేటన్నారు.  పవన్ కళ్యాణ్  గురించి అవాకులు చెవాకులు పేలితే ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios