గుంటూరు: రాష్ట్రానికి సంపద సృష్టించాలి అంటే పెట్టుబడులు తీసుకురావాలని... అందుకు అనువైన మార్గాలు అన్వేషించాల్సిన వైసిపి ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళడం లేదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  చెప్పారు. సంపద సృష్టించడం లేదు సరికదా ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఆస్తులు అమ్మడం అంటే పాలన వైఫల్యమే అని స్పష్టం చేశారు. గుంటూరు నగరానికి ల్యాండ్ మార్క్ లాంటి పి.వి.కె.నాయుడు మార్కెట్ ను వేలానికి పెట్టి అమ్మేయాలనుకోవడం సరికాదని పవన్ అన్నారు. 

బుధవారం రాత్రి గుంటూరు జిల్లా జనసేన నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని పి.వి.కె.నాయుడు మార్కెట్ ను అమ్మాలనే ప్రభుత్వం నిర్ణయాన్నీ, పెరిగిన విద్యుత్ బిల్లుల తీరును వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా గుంటూరు నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి పార్టీ పి.ఏ.సి. సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, పార్టీ లీగల్ విభాగం నాయకులు గాదె వెంకటేశ్వర రావు, సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు పాకనాటి రమాదేవి తదితరులు 24 గంటల దీక్ష చేపట్టారు. వీరికి  పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “సంపద సృష్టించి, ఉపాధి కల్పించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలా కాకుండా ఉన్న ఆస్తులు అమ్మేసి, వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడినవారిని రోడ్డున పడేయడం ఏమిటి? గుంటూరు నగరంలో పి.వి.కె.నాయుడు మార్కెట్ ఒక ల్యాండ్ మార్క్. ఈ మార్కెట్ తో నగర ప్రజలకు ఒక అనుబంధం కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఆ మార్కెట్ మీద ఆధారపడి 5 వేల మంది చిరువ్యాపారులు బతుకుతున్నారు. పేద వర్గాలకు చెందినవారికి ఆ మార్కెట్ ఒక ఉపాధి కేంద్రం. ముస్లింలు, బీసీలు, పేద కులాలకు ఆ మార్కెట్ ఒక ఆధారం.  దాన్ని  అమ్మేసి వారందరినీ రోడ్డున పడేస్తారా?'' అని నిలదీశారు. 

read more   సుధాకర్ ను నాశనం చేయాలనే... ఆ మందులెలా ఇస్తారు?: చంద్రబాబు సీరియస్

''గుంటూరు  పరిసరాల నుంచి, పల్నాడు ప్రాంతం నుంచి ఎంతోమంది నిత్యం రైతులు తమ పంటలు అమ్ముకొనేందుకు పి.వి.కె.నాయుడు మార్కెట్ కు వస్తారు. వారికి అన్యాయం చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజా ఆస్తుల విక్రయించాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. పి.వి.కె.నాయుడు మార్కెట్ ను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలి'' అని సూచించారు. 

''ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులు అమ్మడంతో తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం ఏర్పడింది. పెట్టుబడులు వచ్చే మార్గాన్ని ఈ ప్రభుత్వం అన్వేషించడం లేదు. కరోనాతో ప్రజలందరూ ఆందోళనతో ఉంటే ప్రభుత్వం అండగా నిలవాల్సిందిపోయి విద్యుత్ బిల్లు పెంచేసి ఇబ్బందిపెడుతోంది. మరో వైపు ప్రజా ఆస్తులను అమ్మేస్తోంది. జనసేన నాయకులు, శ్రేణులు ప్రజా ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ చేస్తున్న దీక్షలు నా మనసును కదిలించాయి. ఎప్పుడూ నాయకులు, శ్రేణులకు బాసటగా నిలుస్తాం” అని చెప్పారు.