వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కోనసీమ అల్లర్లు ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన ఆరోపించారు. అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు
జనసేన (janasena) విస్తృతస్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) వెల్లడించారు. కౌలు రైతులకు సాయం కోసం రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన పవన్‌కు సమావేశంలో అభినందనలు తెలియజేశారు. కోనసీమలో (konaseema) శాంతి కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ప్రభుత్వ వైఖరే కారణమంటూ తీర్మానించారు. కులాలను విభజించి పాలించాలనేది వైసీపీ విధానమని పవన్ ఆరోపించారు. కోనసీమ అల్లర్లను ప్రభుత్వం సృష్టించిన విధానం చాలా బాధాకరమన్నారు. కోనసీమ అల్లర్లను బహుజన ఐక్యత మీద దాడిగా జనసేన చూస్తోందని పవన్ పేర్కొన్నారు.
ఏ ప్రాంతంలోనైనా కొన్ని గొడవలు వుంటాయని.. విజయవాడలో గతంలో జరిగిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ రెండు కులాల మధ్య చిచ్చు రేపిందని ఆయన గుర్తుచేశారు. కులం అనగానే వచ్చే భావన దురదృష్టవశాత్తూ ఆంధ్రా అంటే రాదని పవన్ వ్యాఖ్యానించారు. మనదేశంలో అవినీతి అనేది రాజకీయాల్లో సహజంగా మారిందని.. అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమాలపై ఏ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన ప్రశ్నించారు. మద్యంపై ఫిర్యాదు చేయాలంటే జగన్‌పైనే చేయాలంటూ పవన్ చురకలు వేశారు. మనం నిజాయితీగా వున్నా.. అవినీతి, దాడులు చేసే వారి పాలనలో బతకడం ఇబ్బందిగా వుందంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.
Also Read:అవినీతిపై ఫిర్యాదుకు సరికొత్త ఏసీబీ యాప్.. బటన్ నొక్కితే చాలన్న జగన్
కాగా.. ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని అంతం చేసే లక్ష్యంతో ఉద్దేశించిన ఏసీబీ 14400 యాప్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి అంతం దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎక్కడైనా,ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జగన్ సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి లేకుండా లక్షా 41 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని సీఎం గుర్తుచేశారు.
ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధక చట్టంలో బాధ్యత వుంటుందని జగన్ అన్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసి బటన్ నొక్కి వీడియో లేదా ఆడియో సంభాషణ రికార్డు చేస్తే చాలని.. అది నేరుగా ఏసీబీకి చేరుతుందని సీఎం పేర్కొన్నారు. ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుందని .. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని జగన్ హెచ్చరించారు. మనస్థాయిలో అనుకుంటే 50 శాతం అవినీతి అంతం అవుతుందని సీఎం పేర్కొన్నారు. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని.. అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యమని జగన్ పేర్కొన్నారు. ఎవరైనా అవినీతి చేస్తూ పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సీఎం జగన్ మరోసారి హెచ్చరించారు.
