ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని అంతం చేసే లక్ష్యంతో ఉద్దేశించిన ఏసీబీ 14400 యాప్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. యాప్ డౌన్‌లోడ్ చేసి బటన్ నొక్కి వీడియో లేదా ఆడియో సంభాషణ రికార్డు చేస్తే చాలని.. అది నేరుగా ఏసీబీకి చేరుతుందని సీఎం పేర్కొన్నారు
ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని అంతం చేసే లక్ష్యంతో ఉద్దేశించిన ఏసీబీ 14400 యాప్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి అంతం దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎక్కడైనా,ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జగన్ సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి లేకుండా లక్షా 41 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని సీఎం గుర్తుచేశారు.
ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధక చట్టంలో బాధ్యత వుంటుందని జగన్ అన్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసి బటన్ నొక్కి వీడియో లేదా ఆడియో సంభాషణ రికార్డు చేస్తే చాలని.. అది నేరుగా ఏసీబీకి చేరుతుందని సీఎం పేర్కొన్నారు. ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుందని .. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని జగన్ హెచ్చరించారు. మనస్థాయిలో అనుకుంటే 50 శాతం అవినీతి అంతం అవుతుందని సీఎం పేర్కొన్నారు. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని.. అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యమని జగన్ పేర్కొన్నారు. ఎవరైనా అవినీతి చేస్తూ పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సీఎం జగన్ మరోసారి హెచ్చరించారు.
ఏసీబీ యాప్ ఎలా పనిచేస్తుంది?
తొలుత గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ సమయంలో మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ సిద్ధంగా ఉంటుంది. ఈ యాప్‌లో 2 కీలక ఫీచర్లు ఉంటాయి. యాప్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు కోసం ప్రతి ఒక్కరూ తమ దగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఉంది. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. కాగా త్వరలో ఐఓఎస్ వెర్షన్‌లోనూ ఈ యాప్‌ను సిద్ధం చేస్తామని ఏసీబీ వెల్లడించింది.
