ఎన్ని కోట్లు కావాలి జగన్.. నోట్ల కట్టల్ని ముద్దలుగా తింటావా, దోపిడీ అలవాటైన వాడు మారడు : పవన్ కల్యాణ్
విశాఖలో జరిగిన వారాహి విజయ యాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు మరొక్క అవకాశం ఇవ్వొద్దని.. తాను మారిన మనిషిని అంటే నమ్మొద్దని పవన్ పిలుపునిచ్చారు.
విశాఖలో జరిగిన వారాహి విజయ యాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయరని.. సింహాద్రి సాక్షిగా చెబుతున్నా వాలంటీర్లపై ద్వేషం లేదన్నారు. వాలంటీర్లతో జగన్ తప్పుడు పనులు చేయిస్తున్నారని.. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన పని లేదని పవన్ పేర్కొన్నారు. మేమేమీ మీ బానిసలం కాదని.. ప్రాణాలకు తెగించి ప్రజలు పోరాటానికి సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి అఢ్డాగా మార్చారని.. ప్రశాంత విశాఖ గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఇరుక్కపోయిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
మీకెందుకు భయపడాలి.. మీరేమైనా దిగొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా వాలంటీర్లతో జగన్ పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉదయం పథకం కింద డబ్బులిస్తారు.. యంత్రం లిక్కర్ తో పట్టుకుపోతారని పవన్ సెటైర్లు వేశారు. 30 వేల మంది మహిళలు అపహరణకు గురైతే జగన్ సమావేశం పెట్టరని ఎద్దేవా చేశారు. ఆంధ్ర యూనివర్శిటీని జగన్ భ్రష్టు పట్టించాడని.. ప్రజలను దొచుకునే గుండాల తోలు ఒలిచే ప్రభుత్వాన్ని తెస్తామన్నారు. జగన్‌ను ఆటలాడిస్తామని.. అక్రమాలు చేసే ఎమ్మెల్యేలు, ఇతరుల ఫైళ్లు కేంద్రం వద్ద ఉన్నాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పది మంది దోచేస్తున్నారు, మకెందుకు ధైర్యం లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేల కోసం ప్రాణాలకు తెగించేవాళ్లు కావాలి, నేనున్నాను అని పవన్ పిలుపునిచ్చారు. ఎంత డబ్బు కావాలి జగన్ నీకు, ఎన్ని కోట్లు కావాలి జగన్ అంటూ ఆయన ప్రశ్నించారు. నోట్ల కట్టలు పట్టుకుని ముద్దలు ముద్దలుగా తింటావా అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు మరొక్క అవకాశం ఇవ్వొద్దని.. తాను మారిన మనిషిని అంటే నమ్మొద్దని పవన్ పిలుపునిచ్చారు. జగన్‌కు డబ్బు పిచ్చి పట్టుకుందని.. దోపిడీకి అలవాటు పడ్డవాడు మారడు, అతనికి మరో అవకాశం ఇస్తారా అని జనసేనాని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తిని పెంచాలి కానీ తాకట్టు పెట్టకూడదని పవన్ కల్యాణ్ చురకలంటించారు.
ఈ ముఖ్యమంత్రి నాయకుడు కాదు వ్యాపారి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి పవన్‌కు అధికారం ఇస్తే ఆంధ్రను కాపాడుకోలేమని.. మద్యపాన నిషేధం పెడతానని చెప్పి మద్యం రేట్లు పెంచారని పవన్ ఎద్దేవా చేశారు. మీరు పెట్టిన పరీక్షకు నిలబడ్డానని.. ఓడినా గుండెల్లో పెట్టుకున్నారని, జగన్ మద్యం మీద రూ.30 వేల కోట్లు సంపాదించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీలో చైల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని.. సారాకొట్టు నుంచి సిమెంట్ పరిశ్రమ వరకు అంతా జగన్ కిందే వుందన్నారు.
ఎవరూ పచ్చగా వుండకూడదన్నది సీఎం ఆలోచన అని.. అధికారం ఇచ్చింది పాలించడానికని, పీడించడానికి కాదని పవన్ అన్నారు. ఒక్క కులంతోనే పదవులు నింపుతానంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే ప్రయోజనం ఏంటి.. రాజ్యాంగానికి కట్టుబడి వుండాల్సిన వారు కులానికి కట్టుబడి వుంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు. జనసేన అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తుందని.. ఈ ముఖ్యమంత్రి ఓ దోపిడీదారు , ఓ దొంగ అని పవన్ ఆరోపించారు. తాను ఇలా అన్నందుకు తనపై కేసులు వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.