సారాంశం

తాను అరెస్ట్ కావడానికి సిద్ధమని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనను చిత్రవధ చేయాలని, దెబ్బలు తినడానికి సద్ధమన్నారు పవన్. రాష్ట్రం బాగుండాలంటే జగన్ పోవాలన్నారు. 

వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రాసిక్యూషన్‌కు రెడీ అని, అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు. 

తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. పొరపాటున మానభంగాలు జరిగిపోతాయని మంత్రులు అన్నారు.. వారిని ప్రాసిక్యూట్ చేయరా అని ఆయన ప్రశ్నించారు. తాను దెబ్బలు తినడానికి సిద్ధంగానే వున్నానని పవన్ పేర్కొన్నారు. తాను ఒక మాట అన్నానంటే అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడుతానని జనసేనాని తెలిపారు. 23 అంశాలతో కూడిన డేటాను వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్నారని.. వాలంటీర్లు సేకరించే సమాచారం డేటా ప్రొటెక్షన్ కిందకు వస్తుందని పవన్ చెప్పారు. 

ALso Read: వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: కోర్టులో ఫిర్యాదుకు జగన్ సర్కార్ నిర్ణయం

డేటా చౌర్యం చాలా తీవ్రమైన నేరమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నానక్ రామ్ గూడాకు ఏపీ ప్రజల డేటా వెళ్తోందని.. ఎఫ్‌వోఏ , మరో మూడు కంపెనీలు ఎవరివి అని పవన్ ప్రశ్నించారు. డేటా చౌర్యాన్ని కేంద్రం దాకా తీసుకెళ్తానని.. నీ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనంటూ జగన్‌ను హెచ్చరించారు. వైసీపీ నేతల మైనింగ్ అక్రమాలు, దోపిడీలు అన్ని బయటకు తీస్తానని.. మీ ప్రభుత్వానికి, మీకు రోజులు దగ్గరపడ్డాయని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రజలకు సంబంధించిన డేటాను రెవెన్యూ శాఖ అధికారి నుంచి ఇంకో శాఖకు పంపాలంటేనే ఎన్నో అనుమతులు తీసుకోవాలని పవన్ తెలిపారు. అలాంటిది వైసీపీ నేతలు.. ప్రభుత్వం దగ్గర వుండాల్సిన డేటాను ప్రైవేట్ పరం చేశారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపాలని హైదరాబాద్ అయినా, మంగళగిరి అయినా తాను రెడీ అన్నారు. భయపడేవాడిని అయితే పార్టీ ఎందుకు పెడతానంటూ పవన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం జీవితాన్ని పణంగా పెడతానని.. వాలంటీర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేనాని డిమాండ్ చేశారు