తనకున్న కెపాసిటీకి ఏదో ఒక పదవి పోందవచ్చని  జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం జగన్‌లాగా తాను అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కాకినాడలో మాట్లాడుతూ.. తనకున్న కెపాసిటీకి ఏదో ఒక పదవి పోందవచ్చని, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదన్నారు. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్ట పడాల్సిన పనిలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను చాలా కమిట్‌మెంట్‌తో జనసేన పార్టీని స్ధాపించానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సీఎం జగన్‌లాగా తాను అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అభ్యర్ధించారు. తనకు ఎంపీలనిస్తే.. పని చేయిస్తానని, పవన్‌కు ఇంత ఓటు షేర్ వుంది కాబట్టే నన్ను ప్రధానమంత్రి పిలిచారని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల ఆదాయాన్ని సీఎం జగన్ ముగ్గురికి అంటగట్టేశారని .. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇసుక బిజినెస్ చేసే మూడు కంపెనీలు వున్నాయని పవన్ ఆరోపించారు. వాటికి రూ.10 వేల కోట్లు వెళ్లిపోతున్నాయన్నారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: ఒళ్లు కొవ్వెక్కి కోట్టుకుంటున్నాడు.. కోన్‌కిస్కాగాడు .. ద్వారంపూడిని ఈసారి గెలవనివ్వను: పవన్ కళ్యాణ్

అంతకుముందు వారాహి యాత్రలో భాగంగా నిన్న కాకినాడలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. కోన్‌కిస్కా గాళ్లంటే తనకు భయం లేదన్నారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ద్వారంపూడి పీకలదాకా మందు తాగి, మద్యం మత్తులో తనను బూతులు తిట్టాడని పవన్ ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యేకి ఒళ్లు తిమ్మిరిగా వుందని, నోటిదూల ఎక్కువైందన్నారు. ద్వారంపూడి తాతలు, తండ్రులు వూళ్లో పెద్ద రౌడీలని.. వాళ్ల ఫ్యామిలీ బియ్యాన్ని దొంగ రవాణా చేస్తారని పవన్ వ్యాఖ్యానించారు. దొంగ నోట్లు ముద్రించేవాళ్లని.. వాళ్లని అప్పటి ఎస్పీ డీటీ నాయక్ సంకెళ్లు వేసి జీపు వెనుక నడిపించాడని జనసేనాని చురకలంటించారు. 

తనను నానా మాటలు అన్నా తనకు బాధలేదని.. కానీ జనసేన కార్యకర్తలు, వీర మహిళలపై రాళ్లు దాడి చేయించినందుకు తనకు విపరీతమైన కోపం వచ్చిందన్నారు. వారిని పరామర్శించేందుకు తాను తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంటే 144 సెక్షన్ పెట్టారని పవన్ గుర్తుచేశారు. పంతం నానాజీ, సందీప్ పంచకర్లకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. తనకు అన్ని గుర్తున్నాయని.. ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించే బాధ్యతను తాను తీసుకుంటానని జనసేనాని వెల్లడించారు. 

క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే తనకు నచ్చదని.. పాలించేవాడు క్రిమినల్ అయితే ఏం చేయాలని పవన్ ప్రశ్నించారు. ద్వారంపూడిపై జనవాణిలో ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని జనసేనాని వెల్లడించారు. 2009 నుంచి రాజకీయాల్లో కొనసాగి వుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చేదికాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సినిమాల్లో బిజీ కావడం వల్ల కాస్త లేట్ అయ్యిందని.. తాను ఏం మాట్లాడినా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారన్న అహంకారంతో .. ద్వారంపూడి తనను బూతులు తిట్టాడని పవన్ ఫైర్ అయ్యారు. క్రిమినల్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అండగా వుంటున్నారని ఆయన ఆరోపించారు.