ఢిల్లీలో పవన్ కళ్యాణ్: బీజేపీ ఏపీ ఇంచార్జీ మురళీధరన్ తో భేటీ
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ ఇంచార్జీ మురళీధరన్ తో ఇవాళ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ ఇంచార్జీ మురళీధరన్ తో సోమవారంనాడు భేటీ అయ్యారు. ఇవాళ ఉదయమే పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి చేరకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారనే ప్రచారం కూడా లేకపోలేదు.
గత కొంతకాలంగా బీజేపీ, జనసేన మధ్య అంతరం పెరుగుతుందనే ప్రచారం సాగుతుంది. అదే సమయంలో జనసేన టీడీపీకి దగ్గరైందనే ప్రచారం కూడా సాగింది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు రెండు దఫాలు సమావేశమయ్యారు.
బీజేపీ, జనసేన మధ్య అగాధానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమనే ఆరోపణలు కూడా లేకపోలేదు. బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు ఈ ఆరోపణలు చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై ఈ విషయమై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
2019 ఎన్నికల తర్వాత నుండి బీజేపీ, జనసేన మధ్య మితృత్వం కొనసాగుతుంది. గత కొంత కాలంగా ఈ రెండు పార్టీల మధ్య అగాధం ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీయేతర పార్టీల అభ్యర్ధులను గెలిపించాలని పట్టభద్రులను జనసేన కోరింది. కానీ, బీజేపీ అభ్యర్ధులకు ఓటేయాలని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. జనసేనతో అగాధం విషయాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
also read:కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసం పవన్ ప్రచారం?.. ఢిల్లీ టూర్ వెనక అసలు కారణం అదేనా..!
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు , రానున్న ఎన్నికల్లో పొత్తులపై అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ అగ్రనేతలతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్టుగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో పొత్తులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.