జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. అయితే బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతోనే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఉదయపూర్ పర్యటనలో పవన్ కల్యాణ్ ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తుందని.. అందుకోసం మాట్లాడేందుకే పవన్ ఢిల్లీకి పిలిపించారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కర్ణాటకలో మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారిని ఆకర్షించేందుకు పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపాలని చూస్తోంది. కోలార్, చిక్కబల్లాపూర్‌తో సహా రాష్ట్రంలో తెలుగు మాట్లాడే జనాభా ఉన్న ఇతర ప్రాంతాలలో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొనేలా చేయాలని భావిస్తోంది. తద్వారా తెలుగు మట్లాడే వారి ఓట్లను తమ ఖాతాలో వేసుకోవచ్చని ప్రణాళికలు సిద్దం చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సరిహద్దును పంచుకుంటున్న కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వీరు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్దేశించడంలో కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు మాట్లాడే ప్రజల మద్దతు కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తుంది. ఇక, గతంలో 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పవన్ కల్యాణ్.. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
