పాత పాటనే వినిపించిన జైట్లీ నిర్దిష్టంగా ఒక్క హామీని కూడా ప్రకటించలేదు భాజపా నేతల్లో అయోమయం

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పాత పాటనే మరోసారి వినిపించారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ఇంత కాలమూ కేంద్రం ఏ పాట అయితే వినిపిస్తోందో అదే పాటనే జైట్లీ సాబ్ తాజాగా శుక్రవారం మరోసారి పాడారు. కాకపోతే ఇంతకాలమూ పాడిన పాట ఢిల్లీ నుండి అయితే ఇపుడు విజయవాడ నుండి పాడారు అంతే తేడా. రాజధాని అమరావతిలో పలు శంకుస్ధాపన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జైట్లీ ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ముందుగా పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు.

 ఆ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మొత్తం ఐదేళ్ళలో కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు అన్నీ రకాలుగా సాయం అందనున్నట్లు చెప్పారు. ఐదేళ్ళలో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ. 2.03 లక్షల కోట్ల విలువైన సాయం అందించనున్నట్లు తెలిపారు. రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, తిరుపతిలో ప్రపంచ స్ధాయి విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. పనిలో పనిగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని, రెండున్నరేళ్ళలో విద్యా సంస్ధలను మంజూరు చేసామని చెప్పుకొచ్చారు.

జైట్లీ చెప్పిన వాటినే ఒకసారి చూస్తే, ఏపి అభివృద్ధికి కేంద్రం చేయనున్న రూ. 2.03 లక్షల కొట్ల సాయం ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదు. జాతీయ రహదారుల నిర్మాణం, వచ్చిన, రాబోతున్న విద్యా సంస్ధలు, పోలవరం లాంటి ప్రాజెక్టుకు మంజూరు చేయనున్న నిధులు, రాజధాని నిర్మాణానికి సాయం, ఇలా సమస్ధ విభజన హామీలను కలిపి జైట్లీ మళ్ళీ చెప్పుకొచ్చారు.

పైగా ఇందులో ప్రతీ సంవత్సరమూ బడ్జెట్లో అన్నీ రాష్ట్రాలకు ఇచ్చే వాటిని కూడా కలిపేసినట్లు ఉన్నారు. అంతేకానీ రాబోయే రెండున్నరేళ్ళలో రాష్ట్రానికి చేయబోయే సాయం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. జైట్లీ ప్రసంగంలో ఒక్క విషయం కూడా కొత్తది లేకపోవటంతో రేపటి రోజున ప్రజలకు ఏమి చెప్పాలో అర్ధం కాక భాజపా నేతలు తలలు పట్టుకున్నారు.

 ఇక, రెవిన్యూలోటును కేంద్రం భర్తీ చేస్తుందని చెబుతున్నారే గానీ నిర్దిష్టంగా ఇంతకాలంలో భర్తీ చేస్తామని ప్రకటన మాత్రం చేయలేదు. ఎన్ డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీలను కూడా పూర్తిగా అమలు చేయలేదన్న మాట వాస్తవం.

ఈ విషయంలోనే ప్రజలందరూ కేంద్రంపై మండిపడుతున్నారు. ఏపి ప్రజల మనోభావాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా తాము అనుకున్నట్లే ముందుకు పోతున్న ఎన్ డిఏ సర్కార్ కు, రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చిన యూపిఏ ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదని ప్రజలు అనుకుంటే అది వారి తప్పెంతమాత్రం కాదు.