రాజకీయాలన్నాక ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవటం సహజం. బహిరంగసభలన్నాక వచ్చిన జనాలకు కిక్కు కోసం కాస్త ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూనే ఉంటారు. అయితే, ఆ వ్యాఖ్యలు సృతిమించినపుడే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నిన్న జగన్ ప్రసంగంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనే ఇపుడు దుమారం రేగుతోంది.
నంద్యాల బహిరంగసభలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చూసిన తర్వాత దూకుడు బాగా ఎక్కువైందన్న విమర్శలు మొదలయ్యాయి. రాజకీయాలన్నాక ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవటం సహజం. బహిరంగసభలన్నాక వచ్చిన జనాలకు కిక్కు కోసం కాస్త ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూనే ఉంటారు. అయితే, ఆ వ్యాఖ్యలు సృతిమించినపుడే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నిన్న జగన్ ప్రసంగంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనే ఇపుడు దుమారం రేగుతోంది.
చంద్రబాబు నైజాన్ని వివరిస్తూ ‘చంద్రబాబును నడిరోడ్డులో పెట్టి కాల్చినా తప్పులేదనిపిస్తోంది’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపైనే సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. నిజానికి చంద్రబాబుపై అంతటి ఘాటు వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం లేదు. ఎన్నికల్లో ఎన్నో హామీలిస్తుంటారు నేతలు. అవన్నీ అమలు చేయవచ్చు చేయలేకపోవచ్చు. మళ్ళీ ఎన్నికలపుడు అటువంటి నేతలకు ఎలా బుద్ది చెప్పాలో జనాలకు బాగా తెలుసు.
పోయిన ఎన్నికల్లో చంద్రబాబు అమలు సాధ్యంకాని అనేక హామీలిచ్చింది వాస్తవమే. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై పిల్లిమొగ్గలు వేస్తున్నారు. ఇదంతా జనాల అనుభవంలో ఉన్నదే. చంద్రబాబు మోసం చేసాడని అనుకుంటే వచ్చే ఎన్నికల్లో జనాలే టిడిపికి బుద్ది చెబుతారు. హామీలివ్వటం, నెరవేర్చకపోవటం అనే విషయాలను జగనే కాకుండా వైసీపీ నేతలు కూడా గడచిన మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు.
పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి జగన్ జనాల్లోనే తిరుగుతున్నారు. మామూలుగా అయితే, ఓటమి తర్వాత చాలా కాలం జనాల్లో తిరగటానికి చాలామంది ఇష్టపడరు. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. నేతలను, శ్రేణులను కదలిస్తున్నారు. ఎక్కడ సమస్య కనబడినా, అవినీతి జరిగిందనుకున్నా వైసీపీ ఆందోళనలు చేస్తూనే ఉంది. ఇదంతా జగన్ నాయకత్వ లక్షణాలకు సూచనే. ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అనేక అంశాల్లో జగన్ ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. మారిన పరిస్ధితిల్లో కేంద్రంతో సయోధ్యా కుదుర్చుకున్నారు.
మొత్తం మీద జగన్ అంటే జనాల్లో క్రేజ్ సంపాదించుకున్న మాటా వాస్తవమే. మొన్నటి ప్లీనరీలో ‘నవరత్నాలు’ అంటూ జగన్ ఇచ్చిన హామీల పట్ల జనాలు కూడా సానుకూలంగానే స్పందించారు. అదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కూడా జట్టుకట్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ ఊపు పెరుగుతోందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలోనే జగన్ సంయమనం కోల్పోకూడదు. చంద్రబాబు గురించి జనాలకు జగన్ కొత్తగా చెప్పదేమీలేదు. చెప్పకతప్పదు కాబట్టి హుందాగా ఉంటేనే జనాలు హర్షిస్తారన్న విషయాన్నిజగన్ గుర్తుంచుకోవాలి.
