నాయకులను కాదు ప్రజలనే నమ్ముకున్నాను

నాయకులను కాదు ప్రజలనే నమ్ముకున్నాను

‘నేను ప్రజలను నమ్ముకున్నాను కానీ నాయకులను కాదు’...ఇది తాజాగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న జగన్ సాక్షి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మొట్టమొదటి సారిగా సాక్షి టివికి జగన్ ఇంటర్వ్యూ ఇవ్వటం గమనార్హం. ఆ సందర్భంగా ఫిరాయింపులపై మాట్లాడుతూ, ఒక నాయకుడు వెళ్ళిపోతే మరో నాయకుడు వస్తాడని అన్నారు. ఖాళీ అయిన నియోజకవర్గంలో ఎంఎల్ఏ టిడిపిలోకి ఫిరాయిస్తే ఆ నియోజకవర్గం ఖాళీగా ఉండదు కదా అని ప్రశ్నించారు. వెళ్ళిపోయిన నాయకుని స్ధానంలో మరో నేతతో భర్తీ చేసుకుంటామని చెప్పారు.

తాను మొదటి నుండి కూడా నాయకులను నమ్ముకోలేదని స్పష్టం చేశారు. మొదటి నుండి కూడా తాను ప్రజలను నమ్ముకున్నానే కానీ నాయకులను కాదని స్పష్టంగా చెప్పారు. పార్టీ పెట్టినపుడు తాను, తన అమ్మ మాత్రమే ఉన్నామన్న విషయం మరచిపోకూడదన్నారు. ప్రజలు ఆశీర్వదించారు, దేవుని ఆశీర్వాదాలతో 67 మంది ఎంఎల్ఏలు, 9 మంది ఎంపిలు వైసిపి తరపున గెలిచారన్న విషయం అందరూ గుర్తించాలని చెప్పారు. వెళ్ళిన వాళ్ళందరూ చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయే వెళ్ళారన్నారు. ఇపుడు వైసిపిలో ఉన్న 44 మందిని ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తున్నా వాళ్ళు ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడ్డారని తెలిపారు.

ఫిరాయింపులపై మాట్లాడుతూ, సిగ్గు, లజ్జ లేకుండా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గిడ్డి ఈశ్వరి పార్టీ ఫిరాయించటం దురదృష్టకరమన్నారు. తనకు చాలా బాధ కలిగిందన్నారు. తమ పార్టీ మొత్తం ఎలక్షన్ హట్ లోనే ఉన్నారని జగన్ స్పష్టం చేసారు. సలహాలు, సూచనల కోసమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఎంగేజ్ చేసుకున్నట్లు తెలిపారు. అభ్యర్ధుల ఎంపికలో ప్రశాంత్ కిషోర్ పాత్ర పెద్దగా ఉండదన్నారు.

నంద్యాల ఉపఎన్నికలో టిడిపి గెలుపు కేవలం వాపు మాత్రమే అన్నారు. నిజంగా అది బలుపని చంద్రబాబు నమ్ముకుంటే మిగిలిన ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు పెట్టించి ఉండేవారే కదా అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమన్నది పెద్ద స్కాంగా అభివర్ణించారు. స్కాంను చూసి కేంద్రప్రభుత్వమే భయపడిపోయిందని ఎద్దేవా చేశారు.

పాదయాత్ర సందర్భంగా తాను చేస్తున్న హామీలను అమలు చేయటం కష్టం కాదన్నారు. రేపటి ఎన్నికల తర్వాత ప్రభుత్వం బడ్జెట్ సుమారుగా రూ. 1.90 లక్షల కోట్లుంటుందన్నారు. అంత పెద్ద బడ్జెట్లో తన హామీలను నెరవేర్చటం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు. 45 ఏళ్ళకే పింఛన్ ఇవ్వటాన్ని సమర్ధించుకున్నారు. ప్రజలు ఎవరు కూడా చంద్రబాబును నమ్మటం లేదన్నారు. సిఎం అబద్దాల్లో బతుకుతున్నాడు కాబట్టే పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేకపోతున్నాడని జగన్ స్పష్టంగా చెప్పారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page